Share News

తమిళనాట ‘డీలిమిటేషన్‌’ మంటలు!

ABN , Publish Date - Apr 17 , 2026 | 03:45 AM

కేంద్ర ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తమిళనాడు వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. డీఎంకే పిలుపుమేరకు గురువారం ఉదయం నుంచి ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా తమ నివాసాలు..

తమిళనాట ‘డీలిమిటేషన్‌’ మంటలు!

  • రాష్ట్రవ్యాప్తంగా బిల్లు ప్రతుల దహనం

  • జ్వాలలు ఢిల్లీకి వ్యాపించడం ఖాయం: స్టాలిన్‌

చెన్నై, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తమిళనాడు వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. డీఎంకే పిలుపుమేరకు గురువారం ఉదయం నుంచి ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా తమ నివాసాలు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో నల్లజెండాలు ఎగురవేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్‌ బిల్లు ప్రతులను ఈ సందర్భంగా దహనం చేశారు. డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ నామక్కల్‌లో నల్లజెండాను ఎగురవేసి, డీలిమిటేషన్‌ బిల్లు ప్రతులను తగలబెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే నేతలు నల్లదుస్తులు ధరించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ‘రాష్ట్రమంతటా ప్రతిఘటన జ్వాలలు వ్యాపించనివ్వండి. బీజేపీ అహంకారం అంతమవ్వాలి. పూర్వం నిర్బం ధ హిందీ అమలును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా చెలరేగిన జ్వాలలు ఢిల్లీ వరకు వ్యాపించాయి. అలాగే డీలిమిటేషన్‌ వ్యతిరేక జ్వాలలూ ఢిల్లీ వరకు వ్యాపించడం ఖాయం’ అని ఓ ప్రకటనలో సీఎం స్టాలిన్‌ పేర్కొన్నారు.

Updated Date - Apr 17 , 2026 | 03:45 AM