ఆస్తుల వివరాలు వెల్లడిస్తేనే ఉద్యోగులకు పదోన్నతి
ABN , Publish Date - Oct 09 , 2026 | 05:09 AM
ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలను వెల్లడిస్తేనే పదోన్నతులు ఉంటాయని తమిళనాడు ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది.
తమిళనాడు సర్కారు స్పష్టీకరణ
చెన్నై, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలను వెల్లడిస్తేనే పదోన్నతులు ఉంటాయని తమిళనాడు ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయికుమార్ గురువారం ఇందుకు సంబంధించి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ స్థిర, చరాస్తుల వివరాలతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రుణాలు, చేతిలో ఉన్న నగదు వివరాలను ఈ నెల 31వ తేదీలోపు వెల్లడించాలని పేర్కొన్నారు. అలాగే ఇతరుల పేర్లపై ప్రభుత్వ ఉద్యోగలు ఆస్తులు కొనుగోలు చేసివున్నట్టయితే...ఆ వ్యక్తికి, ప్రభుత్వ ఉద్యోగికి ఉన్న సంబంధం స్పష్టం చేయాలని సూచించారు. నిర్ణీత గడువులోగా ఆస్తుల వివరాలను సమర్పించిన ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు మాత్రమే పదోన్నతి జాబితాలో పొందుపరుస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా, ఆస్తుల వివరాలను వెల్లడించని ప్రభుత్వ ఉద్యోగులు క్రమశిక్షణా చర్యలు ఉల్లంఘించిన వారిగా పరిగణింబడతారని సీఎస్ సాయికుమార్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.