ఈ అసెంబ్లీ ఎన్నికలు..ఆర్య-ద్రావిడుల మధ్య సరికొత్త సమరం!
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:10 AM
తమిళనాడులో నాలుగు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఆర్యులు, ద్రావిడుల మధ్య సరికొత్త యుద్ధంగా మారతాయని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ అన్నారు.
తమిళనాడుపై మోదీ దుష్ప్రచారం: స్టాలిన్
చెన్నై, జనవరి 26: తమిళనాడులో నాలుగు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఆర్యులు, ద్రావిడుల మధ్య సరికొత్త యుద్ధంగా మారతాయని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ అన్నారు. ప్రధాని మోదీ, ఆయన పార్టీ బీజేపీ తమిళనాడు భాషా సంస్కృతులను న్యూనత పరచాలని చూస్తున్నట్లు ఆరోపించారు. 1960ల్లో రాష్ట్రంలో హిందీ భాషకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో హిందీని బలవంతంగా రుద్దడాన్ని నిరసిస్తూ తిరుచిరాపల్లికి చెందిన చిన్నసామి అనే వ్యక్తి ప్రాణత్యాగం చేశాడు. దీనిని పురస్కరించుకుని రాష్ట్రంలో ఏటా జనవరి 25న ‘భాషా అమరవీరుల దినం’ నిర్వహిస్తుంటారు. ఆదివారం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో స్టాలిన్ ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. సోమవారం తంజావూరు సమీపంలోని సెంగిపట్టి మైదానంలో జరిగిన డీఎంకే మహిళా విభాగం డెల్టా జోన్ మహానాడు సభలో కూడా ప్రసంగించారు. ఇండో-ఆర్యన్ తెగలు ఉత్తరాది నుంచి స్వదేశీ ద్రావిడులను దక్షిణాదికి తరిమివేసి ఉత్తర భారతంలో స్థిరపడ్డారని తమిళనాడులో ఓ వాదన ప్రచారంలో ఉంది. ఆర్య-ద్రావిడ సమరం వ్యాఖ్యలతో స్టాలిన్ మరోసారి వాటిని తెరపైకి తెచ్చారు.