కుప్పకూలిన స్విగ్గీ, జొమాటోల షేర్లు
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:09 AM
ఎల్‌పీజీ సంక్షోభం.. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ జొమాటో, స్విగ్గీలపై తీవ్రంగా పడింది. ఎల్‌పీజీ కొరతతో దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని రెస్టారెంట్లు...
గల్ఫ్ యుద్ధ ప్రభావంతో ఎల్‌పీజీ కొరత
భారీగా తగ్గిన ఆర్డర్లు
మూతపడ్డ రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్లు
కిచెన్ అప్లయెన్సెస్ కంపెనీ షేర్ల జోరు
ముంబై: ఎల్‌పీజీ సంక్షోభం.. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ జొమాటో, స్విగ్గీలపై తీవ్రంగా పడింది. ఎల్‌పీజీ కొరతతో దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్స్ కార్యకలాపాలు స్తంభించిపోవటంతో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ ఆర్డర్లు భారీగా తగ్గిపోయాయి. ఆర్డర్లకు తగ్గట్టుగా సరఫరా చేసేందుకు అవకాశాలు లేపోవటంతో రెస్టారెంట్లు తమ ఆన్‌లైన్ ఆర్డర్లను గణనీయంగా తగ్గించాయి. ఇరాన్ యుద్ధం కంటే ముందు గిగ్ వర్కర్లు రోజుకు 30 ఆర్డర్లను డెలివరీ చేస్తుండగా ప్రస్తుతం అది 5 నుంచి 10 ఆర్డర్లకు పడిపోయిందని గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్క్స్ యూనియన్ వెల్లడించింది. దీంతో ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది గిగ్ వర్కర్ల జీవితాలపై తీవ్ర ప్రభావం పడనుందని యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు ఎల్‌పీజీ కొరతతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలు, నగరాల్లో రెస్టారెంట్లు, దాబాలు, క్లౌడ్ కిచెన్స్ మూతపడ్డాయి. దీంతో స్విగ్గీ, జొమాటో ఆర్డర్లు 50 నుంచి 60 శాతం తగ్గిపోయినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.
ఆన్‌లైన్ ఆర్డర్లు గణనీయంగా తగ్గిపోతుండటంతో స్టాక్ మార్కెట్లో స్విగ్గీ, ఎటర్నల్ (జొమాటో) షేర్లు కొద్ది రోజులుగా భారీగా నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. గురువారం ఎన్‌ఎ్‌సఈలో స్విగ్గీ షేరు ఇంట్రాడేలో 5 శాతం పతనమై 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.271.10కి పడిపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి కొద్దిగా కోలుకుని 1.3 శాతం నష్టంతో రూ.280.90 వద్ద క్లోజైంది. మరోవైపు ఎటర్నల్ షేరు కూడా ఇంట్రాడేలో 5 శాతం పతనమై రూ.213.06 స్థాయిని తాకి చివరకు 1.18 శాతం నష్టంతో రూ.221.17 వద్ద క్లోజైంది. కాగా రెస్టారెంట్ చెయిన్స్ అయిన యునైటెడ్ ఫుడ్ బ్రాండ్స్ షేరు 7.23 శాతం, వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్ 3 శాతం, జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్ 2.14 శాతం, రెస్టారెంట్స్ బ్రాండ్స్ ఆసియా షేరు 1.39 శాతం, సఫైర్ ఫుడ్స్ ఇండియా షేరు 0.12 శాతం మేర నష్టపోయాయి. ఎల్‌పీజీ కొరత కారణంగా ఇండక్షన్ కుక్‌టాప్స్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరగటంతో కిచెన్ అప్లయెన్సెస్ కంపెనీల షేర్ల ధరలు దూసుకుపోయాయి. గురువారం జైపాన్ ఇండస్ట్రీస్ షేరు ఏకంగా 14.35 శాతం మేర లాభపడగా టీటీకే ప్రెస్జీజ్ షేరు 8.3 శాతం, బట్టర్‌ఫ్లై గాంధీమతి అప్లయెన్సెస్ షేరు 0.65 శాతం మేర లాభపడ్డాయి.