మమతకు మరో ఎదురుదెబ్బ
ABN , Publish Date - Jun 11 , 2026 | 04:15 AM
మమతాబెనర్జీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. టీఎంసీ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన 3 రోజులకే మరో ఎంపీ...
రాజ్యసభ సభ్యత్వానికి సుష్మితా దేవ్ రాజీనామా
న్యూఢిల్లీ, కోల్‌కతా, జూన్ 10: మమతాబెనర్జీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. టీఎంసీ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన 3 రోజులకే మరో ఎంపీ సుష్మితా దేవ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఆమె అస్సాం సీఎం హిమంత శర్మతో సమావేశమయ్యారు. త్వరలో ఆమె బీజేపీలో చేరతారని సమాచారం. అస్సాంకు చెందిన సుష్మితా దేవ్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సంతోష్ మోహన్ దేవ్ కుమార్తె. గతంలో ఆమె అస్సాంలోని సిల్చార్ నుంచి గెలుపొందారు. ఇకపై అస్సాంలోనే రాజకీయాలు చేస్తానని, బెంగాల్‌లో కాదని ఆమె స్పష్టం చేశారు. టీఎంసీకి చెందిన 19 మంది ఎంపీలు తిరుగుబాటు చేసి వేరుకుంపటి పెట్టుకున్నారు. ఈ బృందానికి టీఎంసీ సీనియర్ ఎంపీ కాకోలీ ఘోష్ నేతృత్వం వహిస్తున్నారు. దీదీకి అత్యంత విధేయంగా ఉన్న శత్రుఘ్న సిన్హా, యూసుఫ్ పఠాన్, సయాని ఘోష్ కూడా తిరుగుబాటు బృందంతో చేతులు కలిపారు. జగదీశ్ చంద్ర మసునియా, ఖలి ఉర్ రహమాన్, అబు తాహిర్ ఖాన్, పార్థ భౌమిక్, బాపి హల్దార్, మాలా రాయ్, మితాలీ బాగ్, దీపక్ అధికారి, కాలీపాద సొరేన్, జూన్ మాలియా, అరూప్ చక్రవర్తి, షర్మిలా సర్కార్, అసిత్ కుమార్, శతాబ్ధి రాయ్, రచనా బెనర్జీ కూడా తిరుగుబాటుదారుల బృందంలో ఉన్నారు. టీఎంసీకి లోక్‌సభలో 28 మంది సభ్యులుండగా 19 మంది రెబల్స్‌గా ప్రకటించుకున్నారు. మరోవైపు పశ్చిమబెంగాల్ శాసనసభకు ఇటీవల ఎన్నికైన 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేల్లో 64 మంది తిరుగుబాటు చేశారు.