ఆర్మీ అమ్ములపొదిలోకి ఆత్మాహుతి డ్రోన్లు
ABN , Publish Date - Apr 08 , 2026 | 03:50 AM
భారత ఆర్మీ అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరింది. ‘అత్యవసరం’ ప్రాతిపదికన గుజరాత్‌లోని ఓ కంపెనీ నుంచి వందలాది కామికాజ్ ఆత్మాహుతి డ్రోన్లు సరఫరా అయ్యాయి.
వందలాది కామికాజ్ డ్రోన్లను సరఫరా చేసిన సూరత్ కంపెనీ
గత డిసెంబరులో రూ.10 కోట్ల డీల్.. రెండు నెలల్లోనే సరఫరా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: భారత ఆర్మీ అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరింది. ‘అత్యవసరం’ ప్రాతిపదికన గుజరాత్‌లోని ఓ కంపెనీ నుంచి వందలాది కామికాజ్ ఆత్మాహుతి డ్రోన్లు సరఫరా అయ్యాయి. రక్షణ శాఖతో ఆ కంపెనీ కుదుర్చుకున్న రూ.10 కోట్ల ఒప్పందంలో భాగంగా ఆర్మీలోని ఉత్తర కమాండ్‌కు వీటిని సరఫరా చేసింది. గత ఏడాది డిసెంబరులో సూరత్‌లోని ఇన్‌సైడ్ ఎఫ్‌పీవీ, రక్షణ శాఖకు మధ్య ‘అత్యవసరం ప్రాతిపదికన’ ఈ ఒప్పందం జరిగింది. కేవలం రెండు నెలల్లోనే కంపెనీ ఈ డ్రోన్లను సరఫరా చేయడం విశేషం. అయితే, భద్రతా కారణాల రీత్యా ఎన్ని డ్రోన్లను సరఫరా చేసిందనే వివరాలను మాత్రం వెల్లడించలేదు.
కామికాజ్ డ్రోన్ల ప్రత్యేకత ఏమిటంటే..!?
కామికాజ్ అనేది జపనీస్ పదం. దానర్థం దివ్య పవనం. రెండో ప్రపంచ యుద్ధంలో తమ విమానాలతో శత్రు లక్ష్యాలపై దాడులు చేసిన ఆత్మాహుతి పైలట్లను స్ఫురించేలా ఈ పేరు పెట్టారు. వీటి దారి వన్ వే. ఒకసారి వెళితే మళ్లీ రావడం ఉండదు. శత్రు లక్ష్యాలను గుర్తించి.. వాటిపై పడి తమను తాము పేల్చేసుకుంటాయి. కామికాజ్ డ్రోన్లలో మనుషులుండరు (యూఏవీ). డ్రోన్లో ఓ కెమెరా ఉంటుంది. దానికి ప్రత్యేకమైన గాగుల్స్ ఉంటాయి. దాని ద్వారా లైవ్, రియల్ టైమ్ వీడియోను రికార్డు చేస్తుంది. ఫలితంగా, పైలట్‌కు డ్రోన్లో కూర్చున్న భావన కలుగుతుంది. సంప్రదాయ గైడెడ్ మిస్సైళ్ల కంటే వీటి ఖర్చు తక్కువ. పది నిమిషాల కంటే తక్కువ సమయంలో పోర్టబుల్ ట్యూబుల ద్వారా వీటిని మోహరించవచ్చు. మనకు పెద్దగా నష్టం ఏమీ లేకుండానే సర్జికల్ స్ట్రైక్స్ చేయగల సామర్థ్యం దీని సొంతం. జీపీఎస్ అందుబాటులో లేని, జామ్ అయిన ప్రాంతాలకు కూడా కామికాజ్ డ్రోన్లు వెళ్లగలవు. -35 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత, 50 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ అడవులు, లోయలు, ఎడారుల్లోనూ ఇవి సమర్థంగా పని చేయగలవు. ఇవి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఏఐ ఆధారిత గైడెన్స్‌తో కచ్చితమైన దాడులతో లక్ష్యాలను ఛేదిస్తాయి. ప్రస్తుతం వేగంగా మారుతున్న ఆధునిక యుద్ధ వాతావరణంలో జెట్స్, ట్యాంకర్ల స్థానాన్ని ఇవి ఆక్రమిస్తున్నాయి. లక్ష్యాలను కచ్చితంగా ఛేదించే ఆధునిక అస్త్రాలుగా వీటిని భావిస్తున్నారు. భారత్‌లోని అత్యంత కష్టతరమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా కామికాజ్ డ్రోన్లను రూపొందించామని ఇన్‌సైడ్ ఎఫ్‌పీవీ సీఈవో అర్థ్ చౌదరి తెలిపారు. ఆత్మాహుతి దాడులు (కామికాజ్) చేయడానికి వీటిని ప్రత్యేకంగా తయారు చేశామన్నారు. ఇందులో ఆటోమేటెడ్ నావిగేషన్ మెథడ్, వివిధ దశల్లో భద్రతా యంత్రాంగంతోపాటు పేల్చివేసేందుకు ట్రిగ్గర్ ఉంటుందని తెలిపారు.