ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే విచారిస్తాం
ABN , Publish Date - Oct 02 , 2026 | 04:45 AM
తెలంగాణలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కేసును విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కేసుపై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కేసును విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎమ్మెల్సీల వివాదాలకు సంబంధించిన అన్ని పిటిషన్లు గురువారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. తెలంగాణలో నవంబరులో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్లలో ఒకరైన ఆమీర్ అలీఖాన్ తరఫున సీనియర్ న్యాయవాది సంజయ్ ఎమ్. నులి వాదనలు వినిపిస్తూ.. తాము ప్రస్తుతానికి తమ పిటిషన్‌ను ముందుకు తీసుకెళ్లటం లేదని కోర్టుకు తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే, నవంబరు 18వ తేదీన ప్రాధాన్యత క్రమంలో కేసు విచారణ చేపడతామని పేర్కొంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వివాదం సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోంది. బీఆర్‌ఎస్ హయాంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించగా.. అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. గవర్నర్ నిర్ణయాన్ని శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. ఆ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కోదండరాం, ఆమీర్ అలీఖాన్ పేర్లను గవర్నర్ కోటాలో సిఫార్సు చేయగా గవర్నర్ ఆమోదం తెలిపారు. దీనిని శ్రవణ్, సత్యనారాయణ వ్యతిరేకించటంతో హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కోదండరాం, అలీఖాన్ల పేర్లను ప్రభుత్వం మరోసారి సిఫారసు చేయగా గవర్నర్ ఆమోదం తెలిపారు. వారు ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు. గత ఏడాది సుప్రీంకోర్టు వారి నియామకాలను రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఆ తీర్పుపై ఆమీర్ అలీఖాన్ సుప్రీంకోర్టులో మళ్లీ పిటిషన్ దాఖలు చేశారు.
ప్రభుత్వ టీచర్లకు మరో టెట్ అవకాశం
ప్రభుత్వ సర్వీసులో ఉన్న టీచర్లకు ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టెట్) రాసేందుకు మరో అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇప్పటికే గత నెలలో ఓసారి పరీక్ష నిర్వహించగా గురువారం మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటివరకు టెట్ అర్హత సాధించని ఉపాధ్యాయులు ఈనెల 7 నుంచి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబరు 16 నుంచి 21 వరకు పరీక్షలు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
మహిళపై సామూహిక అత్యాచారం.. ప్రియుడి భార్య సూచనలతోనే.
lప్రయాణికులను కాపాడేది వాళ్లే.. ఎమర్జెన్సీలో జరిగేదేంటో ముందే చెప్పిన హీరో పైలట్