Share News

ఉమ్మడి పౌరస్మృతి అమలుకు సమయమిదే

ABN , Publish Date - Mar 11 , 2026 | 04:16 AM

ఉమ్మడి పౌరస్మృతి దేశవ్యాప్త అమలుపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ వ్యాఖ్యానించారు...

ఉమ్మడి పౌరస్మృతి అమలుకు సమయమిదే

  • అయితే, శాసన సంబంధమైన వ్యవహారమిది

  • మా జోక్యం న్యాయ చిక్కులకు దారి తీయొచ్చు

  • పిటిషనర్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

  • అయితే, ఇది మంచి కేసు అని సీజేఐ వ్యాఖ్య

న్యూఢిల్లీ, మార్చి 10 : ఉమ్మడి పౌరస్మృతి దేశవ్యాప్త అమలుపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ వ్యాఖ్యానించారు. షరియా చట్టంలోని మహిళల పట్ల వివక్ష చూపుతున్న నిబంధనలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఆయన స్వాగతించారు. ‘ఇది చాలా మంచి కేసు’ అని అభిప్రాయపడ్డారు. అయితే, ఇది శాసన వ్యవహారాలతో ముడిపడిన విషయమని, ఒకవేళ తాము పిటిషనర్‌ అభ్యర్థనను మన్నిస్తే అది న్యాయ సంబంధ చిక్కులకు దారి తీయవచ్చునని సీజేఐ నేతృత్వంలోని జస్టిస్‌ జోమాల్య బాగ్చీ, జస్టిస్‌ ఆర్‌. మహదేవన్‌లతో కూడిన త్రిసభ్య బెంచ్‌ తెలిపింది. పిటిషనర్‌ పౌలోమి పావనీ శుక్లా తరఫున హాజరైన న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినిపించారు. ముస్లిం పురుషులతో సమానంగా స్ర్తీలకు వారసత్వ హక్కులు కల్పిస్తూ కోర్టు నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు షరియా చట్టంలోని కొన్ని నిబంధనలను తొలగించడం ద్వారా ముస్లిం స్ర్తీలను భారతీయ వారసత్వ చట్టం పరిధిలోకి తీసుకురావాలని అభ్యర్థించారు. దీనిపై బెంచ్‌ స్పందిస్తూ.. ముస్లిం వారసత్వ వ్యవహారాలను పర్యవేక్షించే స్థాయీచట్టం ప్రస్తుతానికి ఉనికిలో లేదని తెలిపింది. ఈ సమస్యకు ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావడమే పరిష్కారమని చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు. అయితే, ఆదేశిక సూత్రాల అమలు ప్రభుత్వవిధానంలో భాగం కాబట్టి, దీనిపై తాము నిర్ణయం తీసుకోలేమన్నారు. ‘ఒక భర్తకు ఒక భార్య’ అనే సూత్రాన్ని అన్ని సముదాయాలకూ సమానస్థాయిలో వర్తింపజేయలేమని, ద్విభార్యత్వాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించలేమని జస్టిస్‌ బాగ్చీ అన్నారు. ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావాలని మాత్రమే పార్లమెంటును తాము కోరగలమని తెలిపారు. పర్సనల్‌ లా అమలుకు ఉన్న రాజ్యాంగబద్ధతపై కోర్టులు తీర్పులు ఇవ్వగలవని ఎలా భావించారని బెంచ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అయితే, 2017లో ట్రిపుల్‌ తలాక్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయాన్ని ప్రశాంత్‌ భూషణ్‌ గుర్తుచేశారు. పిటిషన్‌పై విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేశారు.

Updated Date - Mar 11 , 2026 | 04:16 AM