Share News

ఫుట్‌పాత్‌లపై నడవడం పౌరుల ప్రాథమిక హక్కు

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:07 AM

రోడ్డు పక్కన కేటాయించిన ఫుట్‌పాత్‌పై నడవడం అనేది పౌరుల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మోటారు వాహనాల కంటే పాదచారుల నడక...

ఫుట్‌పాత్‌లపై నడవడం పౌరుల ప్రాథమిక హక్కు

  • ఈ హక్కుకు భంగం వాటిల్లితే పరిహారం కోరవచ్చు: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, జూన్‌ 19: రోడ్డు పక్కన కేటాయించిన ఫుట్‌పాత్‌పై నడవడం అనేది పౌరుల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మోటారు వాహనాల కంటే పాదచారుల నడక హక్కుకే మొదటి ప్రాధాన్యం ఉంటుందని జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ ఎంఎస్‌ చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఫుట్‌పాత్‌ హక్కుకు భంగం కలిగినా లేదా నష్టం వాటిల్లినా బాధ్యులైన ప్రభుత్వ సంస్థల నుంచి పౌరులు పరిహారం కోరవచ్చునని స్పష్టం చేసింది. ఒక రోడ్డు ప్రమాదంలో తన ఐదేళ్ల కుమారుడిని కోల్పోయిన తండ్రి దాఖలు చేసిన నష్టపరిహారం కేసును విచారిస్తూ న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. రోడ్డు మీద నడిచే హక్కును రాజ్యాంగంలోని జీవించే హక్కు అయిన ఆర్టికల్‌ 21 పరిధిలోకి వస్తుందని కోర్టు తెలిపింది. రోడ్డు ఉన్న ప్రతిచోటా సురక్షితమైన ఫుట్‌పాత్‌లు నిర్మించి నిర్వహించడం మునిసిపల్‌ కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థలు, పంచాయతీల బాధ్యత అని పేర్కొంది. పాదచారుల భద్రతకు సంబంధించి అవసరమైన చట్టపరమైన నిబంధనలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి లా కమిషన్‌కు సుప్రీంకోర్టు సూచించింది. కాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఆసక్తికరంగా స్పందించారు. రోడ్డు మీద నడిచే హక్కును ప్రాథమిక హక్కుగా మార్చినట్లుగానే పౌరుల ‘ఓటు హక్కు’ను కూడా ప్రాథమిక హక్కుగా ఎందుకు ప్రకటించకూడదని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుత తరుణంలో భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా మార్చడం అనేది అత్యంత కీలకం అని ఆయన వ్యాఖ్యానించారు.

Updated Date - Jun 20 , 2026 | 04:07 AM