హైకోర్టు మార్గదర్శకాలు సమర్థనీయమే
ABN , Publish Date - Feb 03 , 2026 | 02:49 AM
సోషల్ మీడియా పోస్టులు, రాజకీయ విమర్శలకు సంబంధించి హైకోర్టు మార్గదర్శకాలు సమర్థనీయమేనని సుప్రీంకోర్టు పేర్కొంది...
పౌరుల ప్రాథమిక హక్కులనుకాపాడాల్సిన బాధ్యత కోర్టులపై ఉంది
యాంత్రికంగా కేసులు పెట్టడాన్ని నియంత్రించాలి
సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంలో పోలీసు కేసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియా పోస్టులు, రాజకీయ విమర్శలకు సంబంధించి హైకోర్టు మార్గదర్శకాలు సమర్థనీయమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత కోర్టులపై ఉందని స్పష్టం చేసింది. యాంత్రికంగా కేసుల నమోదును నియంత్రించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. సోషల్ మీడియా (ఎక్స్)లో కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. దుర్గం శశిధర్‌గౌడ్ అలియాస్ నల్ల బాలు, జి.సతీశ్, వసీం అక్రం, కౌతం సతీశ్‌లపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన జస్టిస్ తుకారాంజీ ఆ మూడు ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులకు సంబంధించి కేసులు నమోదు అంశంలో పోలీసులు, మేజిస్ట్రేట్ కోర్టులకు పలు మార్గదర్శకాలు జారీచేశారు. ట్వీట్లు/పోస్టులు చట్టబద్ధమైన రాజకీయ వ్యక్తీకరణ పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రాథమిక హక్కుల పరిరక్షణతోపాటు కేసుల నమోదు, విచారణ యాంత్రికంగా, ఏకపక్షంగా జరగకుండా నిరోధించే క్రమంలో మార్గదర్శకాలను జారీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు మార్గదర్శకాలు దర్యాప్తు సంస్థల విధులకు ఆటంకం కలిగిస్తున్నాయని పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై సోమవారం జస్టిస్ జే.బీ.పార్దీవాలా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
హైకోర్టు మార్గదర్శకాలు ఇవ్వడంలో తప్పేముంది?
తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్ర వాదనలు వినిపించారు. హైకోర్టు విధించిన కొన్ని మార్గదర్శకాలు ఇబ్బందికరంగా ఉన్నాయని, తీర్పులోని పేరా 29లో ఇచ్చిన మార్గదర్శకాలపై అభ్యంతరం ఉందని వివరించారు. మార్గదర్శకాల్లోని నంబర్ 7, 9 అంశాలు పోలీసుల దర్యాప్తు స్వేచ్ఛను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయ ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టుల విషయంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ముందే పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి న్యాయసలహా తీసుకోవాలని హైకోర్టు సూచించిందని.. కానీ ప్రాసిక్యూషన్ వేరు, దర్యాప్తు వేరు కదా? అనే సందేహం వెలిబుచ్చారు. ఫిర్యాదులు నిరాధారమని తేలితే కేసును మూసేయాలని హైకోర్టు మార్గదర్శకాల్లో పేర్కొందని.. ఇది అనేక కేసులపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని వివరించారు. సాక్ష్యాధారాలు సరిగా లేవనే సాకుతో ఉద్దేశపూర్వకంగానే కొన్ని కేసులను మూసేసే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా జస్టిస్ పార్దీవాలా జోక్యం చేసుకుంటూ.. ‘‘హైకోర్టు మార్గదర్శకాలు ఇవ్వడంలో తప్పేముంది? పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటానికి హైకోర్టు మార్గదర్శకాలు ఇవ్వకూడదా?’’ అని ప్రశ్నించారు. ఒక హైకోర్టు జ్యుడిషియల్ ఆర్డర్ ద్వారా కొన్ని మార్గదర్శకాలు ఇస్తే.. సంబంధిత అధికారులు వాటిని పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. దేశంలోని ఇతర కోర్టులు సైతం ఇటువంటి మార్గదర్శకాలు జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. హైకోర్టు మార్గదర్శకాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం తమకేమీ కనిపించడం లేదంటూ.. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేశారు.