తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల వివాదం కేసు పాత బెంచ్‌కే
ABN , Publish Date - May 05 , 2026 | 03:47 AM
తెలుగు రాష్ర్టాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజన(కేటాయింపు) వివాదం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది.
సీజేఐ అనుమతితో లిస్ట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, మే 4(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ర్టాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజన(కేటాయింపు) వివాదం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది.‘ ేస్టట్ క్యాడర్’ విభజన కోసం నిర్దేశించిన నిబంధనలు, తీర్పులు ‘జోనల్ క్యాడర్’ ఉద్యోగులకు వర్తించవన్న పిటిషనర్ వాదనను సర్వోన్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. అయితే, ఈ వ్యవహారానికి సంబంధించిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) అనుమతితో, గతంలో ఉద్యోగుల కేటాయింపు అంశాలను విచారించిన బెంచ్‌కే బదిలీ చేయాలని రిజిస్ర్టీని ఆదేశించింది. ఈ మేరకు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నియమాలకు విరుద్ధంగా తనను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారని మల్లిక అనే ఉద్యోగిని దాఖలు చేసిన మిస్లీనియస్ అప్లికేషన్(ఎంఏ) సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎం.హసన్ నజ్కీ వాదనలు వినిపిస్తూ.. విభజన సమయంలో రూపొందించిన నిబంధనలు ‘రాష్ట్ర స్థాయి (ేస్టట్) క్యాడర్’ ఉద్యోగులకు మాత్రమే పరిమితమని, పిటిషనర్ ‘జోనల్ క్యాడర్’ కిందకు వస్తారని తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం, ఈ దరఖాస్తును ప్రస్తుతం ఉద్యోగుల కేటాయింపు(బదిలీలు) కేసులను విచారిస్తున్న ధర్మాసనానికి బదిలీ చేయాలని ఆదేశించింది.