పితృత్వ సెలవులు ఇవ్వండి!
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:25 AM
మాతృత్వ సెలవుల తరహాలోనే తండ్రులకు పితృత్వ సెలవులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. ఈ మేరకు చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
నవజాత శిశువుకు తండ్రి స్పర్శ అవసరం.. మాతృత్వ సెలవులపై విచారణ సందర్భంగా సుప్రీం ప్రతిపాదన
న్యూఢిల్లీ, మార్చి 17: మాతృత్వ సెలవుల తరహాలోనే తండ్రులకు పితృత్వ సెలవులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. ఈ మేరకు చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దత్తత తీసుకున్న పిల్లల విషయంలో మాతృత్వ సెలవులకు సంబంధించిన పిటిషన్‌ను విచారిస్తున్న సమయంలో జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల ధర్మాసనం కేంద్రానికి ఈ సలహా ఇచ్చింది. పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిలో తండ్రి పాత్రను విస్మరించడం అన్యాయమే అవుతుందని వ్యాఖ్యానించింది. తండ్రికి కూడా సెలవులు ఇవ్వడం ద్వారా కుటుంబం, పని స్థలాల్లో స్త్రీ-పురుష సమానత్వాన్ని ప్రోత్సహించినట్టవుతుందని అభిప్రాయపడింది. స్త్రీల పనులు, పురుషుల పనులు అన్న విభజనను ఽచెరిపేసేందుకు ఉపకరిస్తుందని వ్యాఖ్యానించింది. పిల్లల పెంపకం ఏ ఒక్కరి పనో కాదని, బాధ్యతను సమానంగా పంచుకోవాలని చెప్పింది. శైశవ దశలో తండ్రి పాత్రపై సమాజంలో అపోహలు ఉన్నాయని, బిడ్డతో తల్లి అంత సన్నిహితంగా ఉండలేడని, తల్లిలాగా తప్పనిసరి అవసరం కాదని అనుకుంటారని వ్యాఖ్యానించింది. శిశువు, తల్లిదండ్రుల అవసరాలకు అనుగుణంగా పితృత్వ సెలవులు ఉండాలని చెప్పింది. శైశవ దశలో భావోద్వేగ బంధాలు బలపడుతాయని, ఆ సమయంలో పక్కనే తండ్రి ఉండడం శివువును శారీరకంగా, మానసికంగా బలోపేతం చేస్తుందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. నవజాత శిశువుకు తండ్రి సాంగత్యం అవసరాలను వాయిదా వేయలేమని, వారాంతాల్లో వారితో గడపడం ద్వారా పూడ్చుకుందామంటే కుదరదని చెప్పారు. ‘‘నవజాత శిశువుకు నాన్న మాటలు వినడం, స్పర్శతో అనుభూతి చెందడం ఎంతో అవసరం. ఇవి కేవలం జ్ఞాపకాలు కావు. భావోద్వేగ భద్రతకు, అనుబంధాలకు పునాది వేసేవి’’ అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవులు ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు దాన్ని దేశపౌరులు అందరికీ వర్తించే విధంగా చట్టబద్ధం చేయాలని సూచిస్తోంది.
దత్తతలో మాతృత్వ సెలవులు నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధం
మరోపక్క నండూరి హంసానందిని వేసిన ప్రధాన పిటిషన్‌లో దత్తత పిల్లల తల్లులకు మాతృత్వ సెలవుల అంశంపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కేవలం మూడు నెలలలోపు పిల్లలను దత్తత తీసుకున్న మహిళలకే మాతృత్వ సెలవు ఇవ్వాలని సామాజిక భద్రత చట్టంలో ఉన్న నిబంధనను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇది రాజ్యాంగంలోని సమానత్వం, వృత్తిపరమైన స్వేచ్ఛ, జీవించే హక్కులకు భంగం కలిగించే విధంగా ఉందని పేర్కొంది. శిశువులను దత్తత తీసుకున్న మహిళలకు కన్న తల్లుల్లాగే మాతృత్వ సెలవులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. బిడ్డను కన్న తల్లికి, దత్తత తీసుకున్న తల్లికి ఒకే తరహా భావోద్వేగాలు ఉంటాయని, చట్టపరంగా సమాన స్థాయి ఉంటుందని ధర్మాసనం తేల్చిచెప్పింది. శారీరక బంఽధాన్ని ఆధారం చేసుకొని మాత్రమే కుటుంబాన్ని నిర్వచించలేమని చెప్పింది. కుటుంబ వ్యవస్థ నిర్మాణంలో దత్తత కూడా భాగమేనని, దానికి ఆమోదం ఉందని తెలిపింది.