ఈ-చలాన్లను కరెంటు బిల్లులో కలిపేయండి
ABN , Publish Date - Sep 29 , 2026 | 05:31 AM
ట్రాఫిక్ నిబంధనలను పాటించని వారికి విధించే ఈ-చలాన్ల వసూళ్లకు అధికారులు కొత్త దారులు వెతకాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 28: ట్రాఫిక్ నిబంధనలను పాటించని వారికి విధించే ఈ-చలాన్ల వసూళ్లకు అధికారులు కొత్త దారులు వెతకాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ-చలాన్లను విద్యుత్ బిల్లులో కలిపేసి వసూలు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. ఈ-చలాన్లు పెద్ద ఎత్తున పెండింగ్‌లో ఉండటంపై సోమవారం కోర్టు తీవ్రంగా స్పందించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో దాదాపు రూ.45 వేల కోట్ల విలువైన ఈ-చలాన్లు పెండింగ్‌లో ఉండగా, ఇప్పటిదాకా రూ.25 వేల కోట్లు వసూలైనట్టు ఈ సందర్భంగా కోర్టు దృష్టికి వచ్చింది. ‘‘ఒకే దారిలో పోతామంటే ఈ దేశంలో కుదరదు. ఈ-చలాన్ల మొత్తాన్ని విద్యుత్ బిల్లుల్లో కలిపేయండి.’’ అని జస్టిస్ పార్ధివాలా సూచించారు. ఈ-చలాన్ కట్టనివారికి ఆర్‌సీ రెన్యువల్ చేయకపోవడం, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీని ఆపివేయడం.. వంటి చర్యలు తీసుకోవచ్చునని అన్నారు.