Share News

పవన్‌ఖేరా బెయిల్‌పై స్టే

ABN , Publish Date - Apr 16 , 2026 | 03:39 AM

కాంగ్రెస్‌ జాతీయ మీడియా, ప్రచార విభాగం చైర్మన్‌ పవన్‌ ఖేరాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు ఆయనకు మంజూరు చేసిన ‘ట్రాన్సిట్‌ ముందస్తు బెయిల్‌....

పవన్‌ఖేరా బెయిల్‌పై స్టే

  • తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను నిలిపివేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ జాతీయ మీడియా, ప్రచార విభాగం చైర్మన్‌ పవన్‌ ఖేరాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు ఆయనకు మంజూరు చేసిన ‘ట్రాన్సిట్‌ ముందస్తు బెయిల్‌’ ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం స్టే విధించింది. ఫోర్జరీ పత్రాల ఆధారంగా తెలంగాణ హైకోర్టు పరిధిని వాడుకునే ప్రయత్నం చేశారన్న అస్సాం ప్రభుత్వం వాదనలను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. అస్సాంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయితే.. తెలంగాణ హైకోర్టు ట్రాన్సిట్‌ ముందస్తు బెయిల్‌ ఇవ్వడంపై తాము ఆశ్చర్యపోతున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా, బెయిల్‌పై స్టే నేపథ్యంలో పవన్‌ఖేరాను అస్సాం పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్‌కు వివిధ దేశాలకు చెందిన పాస్‌పోర్టులతోపాటు విదేశాల్లో అక్రమాస్తులు ఉన్నాయని పవన్‌ ఖేరా ఈ మధ్య మీడియా సమావేశంలో ఆరోపించారు. అస్సాంలో కేసులు నమోదయ్యాయి. ఖేరాను ప్రశ్నించటానికి ఇటీవల ఢిల్లీలోని ఆయన నివాసానికి అస్సాం పోలీసు బృందం కూడా వచ్చింది. ఖేరా అక్కడ లేకపోవటంతో పోలీసులు వెళ్లిపోయారు. కాగా, అరెస్టు నుంచి రక్షణ కోరుతూ పవన్‌ ఖేరా తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. ఏప్రిల్‌ 10న ఆయనకు వారం రోజుల పాటు ట్రాన్సిట్‌ ముందస్తు బెయిల్‌ మంజూరైంది. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ అస్సాం ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. దీనిపై ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. అస్సాం ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ (ఎస్‌జీ) తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు.

ఖేరా చట్టాన్ని దుర్వినియోగం చేశారు

బెయిల్‌ కోసం పవన్‌ ఖేరా ఉద్దేశపూర్వకంగా ఫోర్జరీ పత్రాలు సమర్పించారని తుషార్‌ మెహతా పేర్కొన్నారు. తెలంగాణలో ఈ కేసు విచారణకు సంబంధించి ప్రాదేశిక అధికార పరిధి ఎలా ఉంటుందో ఖేరా ఎక్కడా పేర్కొనలేదన్నారు. ఈ కేసులోని ఒక నేరానికి గరిష్ఠంగా పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉందన్న అంశాన్ని తెలంగాణ హైకోర్టు విస్మరించిందని తెలిపారు. విచారణ సందర్భంగా జస్టిస్‌ మహేశ్వరి స్పందిస్తూ.. ఖేరా సమర్పించిన నోట్‌లో తన భార్య హైదరాబాద్‌లో నివసిస్తున్నట్లు పేర్కొన్నారని గుర్తు చేశారు. దీనిపై తుషార్‌ మెహతా బదులిస్తూ.. ‘ఖేరా భార్య ఆధార్‌ కార్డులో చిరునామా ఢిల్లీ అని ఉంది. ఒకవేళ హైదరాబాద్‌లో ఇల్లు కొన్నా, అద్దెకు ఉన్నా.. అక్కడే విచారణ జరగాలని కోరడం సరి కాదు. ఎవరైనా ఒక వ్యక్తి పది ప్రాంతాల్లో పది ఇళ్లు కొనుగోలు చేసి లేదా అద్దెకు తీసుకొని తనకు నచ్చిన చోట విచారణ జరపమని కోర్టును కోరలేరు. ఇది వేదికను ఎంచుకోవటం కిందికి వస్తుంది. చట్టాన్ని దుర్వినియోగం చేయటమే ఇది’ అని అన్నారు. ఎఫ్‌ఐఆర్‌ అస్సాంలో నమోదైనప్పుడు అక్కడికి వెళ్లటానికి పవన్‌ఖేరా ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నించారు. కాగా, పవన్‌ ఖేరాకు అస్సాంలో కోర్టును ఆశ్రయించేందుకు సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది.

Updated Date - Apr 16 , 2026 | 03:39 AM