Share News

విజయ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట.. గోవధ నిషేధ ఉత్తర్వులపై స్టే!

ABN , Publish Date - Jul 13 , 2026 | 01:08 PM

తమిళనాడులో గోవధను పూర్తిగా నిషేధిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుకు 'సవరణ' అవసరమని పేర్కొంటూ, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని TVK ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం పెద్ద ఊరటనిచ్చింది.

విజయ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట.. గోవధ నిషేధ ఉత్తర్వులపై స్టే!
Supreme Court Stays Madras High Court Order on Cow Slaughter Ban

న్యూఢిల్లీ, జులై 13: తమిళనాడులో గోవధను పూర్తిగా నిషేధిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఇవాళ (సోమవారం) స్టే విధించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుకు 'సవరణ' (Correction) అవసరమని పేర్కొంటూ, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం పెద్ద ఊరటనిచ్చింది.

బక్రీద్ పండుగ సందర్భంగా లేదా మరే ఇతర రోజుల్లోనైనా రాష్ట్రంలో ఆవులు, దూడల వధ జరగకుండా చూడాలంటూ మే 27న మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ విజయ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేసింది.


చట్ట నిబంధనలకు విరుద్ధంగా తీర్పు: తమిళనాడు ప్రభుత్వం

హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం తన వాదనలను వినిపించింది. రాష్ట్రంలో అమలులో ఉన్న చట్టం ప్రకారం.. కొన్ని నిర్దిష్ట కేటగిరీల ఆవులను, అనుమతించిన ప్రాంతాలలో వధించడానికి చట్టబద్ధమైన అనుమతి ఉందని ప్రభుత్వం పేర్కొంది. 'చట్టంలోని నిబంధనలు ఓ నిర్దిష్ట ప్రక్రియకు అనుమతిస్తున్నప్పుడు, దానికి విరుద్ధంగా కోర్టులు న్యాయపరమైన ఆదేశాలు జారీ చేయడం చట్టబద్ధంగా చెల్లదు'. అని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించింది.


వివాదానికి కారణమైన 1976 నాటి జీవో

మద్రాస్ హైకోర్టుకు చెందిన జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్, జస్టిస్ వి. లక్ష్మీనారాయణలతో కూడిన ధర్మాసనం.. ఆగస్టు 1976 నాటి ఓ ప్రభుత్వ ఉత్తర్వును (GO) ఆధారంగా చేసుకుని ఈ నిషేధాన్ని విధించింది. పాల ఉత్పత్తిని పెంచడానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి 1976లో గోవధను నిషేధిస్తూ ఆ ఉత్తర్వు ఇచ్చారు. తీర్పును రాసిన జస్టిస్ స్వామినాథన్.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 ప్రకారం ఆవులు, దూడలు, ఇతర పాడి పశువుల వధను నిషేధించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రాజ్యాంగ పరిషత్ చర్చల్లో కూడా శ్రీకృష్ణుని కాలం నుంచి ఆవు మన నాగరికతతో ముడిపడి ఉన్న అత్యంత గౌరవనీయమైన జంతువుగా పేర్కొన్నారని ఆయన గుర్తుచేశారు.


ఆచరణాత్మక ఇబ్బందులు

తమిళనాడులో సంప్రదాయకంగా బక్రీద్ పండుగ సమయంలో ముస్లింలు స్థానిక నిబంధనలకు లోబడి ప్రైవేట్ ప్రాంగణాల్లో లేదా మతపరమైన ప్రార్థనా స్థలాలలో జంతు బలులు ఇస్తారు. అలాగే, రాష్ట్రంలోని పలు హిందూ దేవాలయాలలో జరిగే వార్షిక ఉత్సవాల్లో కూడా జంతు బలులు ఇచ్చే సంప్రదాయం ఉంది. ఇటువంటి బలులను కేవలం లైసెన్స్ పొందిన కసాయ్‌ఖానాలకే పరిమితం చేయడం ఆచరణాత్మకంగా సాధ్యం కాదని, పండుగ రద్దీని తట్టుకునే సామర్థ్యం ఆయా కేంద్రాలకు లేదని కమ్యూనిటీ నాయకులు వాదిస్తున్నారు.


ఇప్పటికే నియంత్రణ చట్టాలు ఉన్నాయి

తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్రంలో 'తమిళనాడు జంతు సంరక్షణ చట్టం' ఇతర నియంత్రణ నిబంధనలు ఇప్పటికే అమలులో ఉన్నాయని స్పష్టం చేసింది. జంతువులను ఎక్కడ, ఏ పరిస్థితులలో వధించాలనే దానిపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని, అయితే పూర్తి నిషేధం చట్టంలో లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతానికి సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో తమిళనాడులో ఈ వివాదానికి తాత్కాలిక బ్రేక్ పడింది.


Also Read:

తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?

ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్

Updated Date - Jul 13 , 2026 | 01:18 PM