రూ.2,700 ఔషధాన్ని 27,000కు ఎలా విక్రయిస్తారు?
ABN , Publish Date - Sep 23 , 2026 | 03:28 AM
క్యాన్సర్ ఔషధాలను పది రెట్ల అధిక ధరకు విక్రయిస్తూ రోగులను పీల్చిపిప్పి చేస్తున్నారని సుప్రీంకోర్టు మండిపడింది. దీన్ని పట్టపగలు సాగిస్తున్న అమానుష దోపిడీగా అభివర్ణించింది. క్యాన్సర్ చికిత్సల కోసం ప్రజలు ఆభరణాలు, చివరికి ఇళ్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితులను చూస్తున్నామని పేర్కొంది. ప్రాణాధార ఔషధాల ధరలపై నియంత్రణ లేకపోవడం పట్ల తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది.
రోగులను పీల్చిపిప్పి చేస్తున్నారు
చికిత్స కోసం ఆస్తులమ్ముకుంటున్నారు
చర్యలు తీసుకోవాల్సిన అధికారులు
మౌనంగా ఉండడమేంటి?
క్యాన్సర్ మందులు అధిక ధరలకు
విక్రయించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఈ భారం పన్ను చెల్లింపుదారులపైనా
పడుతోందన్న ధర్మాసనం
అన్ని మందులనూ ధరల నియంత్రణ
పరిధిలోకి తేవాలని అభిప్రాయం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: క్యాన్సర్ ఔషధాలను పది రెట్ల అధిక ధరకు విక్రయిస్తూ రోగులను పీల్చిపిప్పి చేస్తున్నారని సుప్రీంకోర్టు మండిపడింది. దీన్ని పట్టపగలు సాగిస్తున్న అమానుష దోపిడీగా అభివర్ణించింది. క్యాన్సర్ చికిత్సల కోసం ప్రజలు ఆభరణాలు, చివరికి ఇళ్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితులను చూస్తున్నామని పేర్కొంది. ప్రాణాధార ఔషధాల ధరలపై నియంత్రణ లేకపోవడం పట్ల తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఔషధ ధరలపై దాఖలైన రెండు పిటిషన్లపై మంగళవారం విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘‘క్యాన్సర్‌కు సంబంధించి కొన్ని అత్యవసర మందులను రూ.27,000కు విక్రయిస్తున్నారు. కానీ, వాటిని రిటైల్ వర్తకుడికి రూ.2,700కే సరఫరా చేస్తున్నారు. ఇది పూర్తిగా అరాచకం. రోగులపై పట్టపగలు సాగిస్తున్న భారీ దోపిడీ. రిటైలర్‌కు ఇచ్చే ధర కంటే ఎంఆర్‌పీ 10 రెట్లు ఎక్కువగా ఉంది. రోగిని ఈ విధంగా ఎలా మోసం చేస్తారు? ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మౌనంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది’’అని ధర్మాసనం ఘా టుగా స్పందించింది. దీన్ని వ్యవస్థాగత మోసంగా, ప్రభుత్వ ఖజానాకు కలిగిస్తున్న (ఆరోగ్య పథకాల కింద రీయింబర్స్‌మెంట్) నష్టంగా పేర్కొంది. ‘‘ఆయుష్మాన్ భారత్ పథకం కింద రోగులు చికిత్స పొందుతున్నప్పుడు.. ఈ అధిక ధరల భారాన్ని చివరకు పన్ను చెల్లింపుదారులే భరించాల్సి వస్తోంది. ఆ స్పత్రులు ఈ ధరలకు మందులను కొనుగోలు చేసి, తర్వాత ప్రభుత్వంనుంచి రీయింబర్స్‌గా పొందుతున్నాయి. అదంతా పన్ను చెల్లింపుదారుల డబ్బే’’అని ధర్మాసనం పేర్కొంది.
రూ.100 ధరను రూ.2,000కు విక్రయిస్తుంటే అది దోపిడీ కాక మరేమిటని ప్రశ్నించింది. ‘‘ధరల నియంత్రణ పరిధిలో లేకపోవడం వల్ల రొసువాస్ అనే ట్యాబ్లెట్ స్ట్రిప్ ధర రూ.214గా ఉంది. ఇదే ఔషధానికి ఆస్పిరిన్ కలిపితే అప్పుడు అది షెడ్యూల్డ్ డ్రగ్ ధరల నియంత్రణలోకి వస్తుంది. అప్పుడు దాని ధర రూ.70మాత్రమే. నిజానికి రెండు మందుల కాంబినేషన్‌కే ఎక్కువ ఖర్చు అవుతుంది’’అని జస్టిస్ మెహతా ఒక ఉదాహరణగా చెప్పారు.
జనరిక్ ఔషధాలనే సూచించాలి..
ఔషధ ధరల నియంత్రణ చట్టం 2013’ కింద జాతీయ ఔషధ ధరల నిర్ణయ మండలి కేవలం 1,000 షెడ్యూల్డ్ డ్రగ్స్ ధరలనే నియింత్రిస్తున్నట్లు పిటిషనర్ కిసాన్‌చంద్ జైన్ తెలిపారు. మిగిలిన 82ు ఔషధాల ధరలను మార్కెట్‌కే విడిచిపెట్టినట్టు చెప్పారు. దీంతో నాన్ షెడ్యూల్డ్ ఔషధాలను భారీ ధరలపై విక్రయిస్తున్నాయని వివరించారు. వైద్యులు రోగులకు జనరిక్ మందులనే సూచించేలా చర్యలు తీసుకోవాలని మరో పిటిషనర్ కోరారు. అలా రాయ ని వైద్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విన్నవించారు. దేశ ఫార్మా మార్కెట్ పరిమాణం రూ.2.5 లక్షల కోట్లుగా ఉంటే, జన్ ఔషధి మార్కెట్ రూ.2,000 కోట్లుగానే ఉన్నట్టు వివరించారు. అన్ని మందులను ధరల నియంత్రణ పరిధిలోకి తీసుకొస్తే.. అప్పుడు జనరిక్ మందుల అవసరం కూడా ఉండకపోవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయెన్స్ తరఫున కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. ఫార్మా కంపెనీలే ఈ భారీ లాభాలను పొందడం లేదని.. ధరల పెరుగుదల ప్రధానంగా రిటైల్ దుకాణాలు, ఆస్పపత్రుల స్థాయిలోనే జరుగుతోందన్నారు. స్టాకిస్టుకు విక్రయించేదే అసలైన ధరగా పేర్కొన్నారు. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ వాది స్తూ.. పౌరులకు అందుబాటు ధరలకే ఔషధాలు చేరాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కేసు తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది.
ఈ వార్తలను చదవండి
డాక్టర్ నా కళ్లను తీసేశారు’.. మొబైల్ అవగాహన కార్యక్రమంలో చిన్నారుల్లో భయం!
ఆ నోటీసులకు కారణం ఏంటి.. ఈసీకి సుప్రీం ప్రశ్న