ఎన్‌టీఏ పాఠాలు నేర్చుకోలేదు
ABN , Publish Date - May 26 , 2026 | 04:11 AM
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో పరీక్ష నిర్వహణ సంస్థ అయిన ఎన్‌టీఏను(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఉద్దేశించి సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
‘నీట్’ లీకేజీపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్య
కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి నోటీసులు
న్యూఢిల్లీ, మే 25: నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో పరీక్ష నిర్వహణ సంస్థ అయిన ఎన్‌టీఏను(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఉద్దేశించి సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. వరుస లీకేజీ ఘటనల తర్వాత కూడా ఎన్‌టీఏ పాఠాలు నేర్చుకోలేదంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల నీట్ లీకేజీ, పరీక్ష రద్దు నేపథ్యంలో.. ఎన్‌టీఏ స్థానంలో స్వతంత్ర సంస్థకు నీట్ నిర్వహణ బాధ్యతను అప్పగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎన్‌టీఏ తీరును బెంచ్ తీవ్రపదజాలంతో ఆక్షేపించింది. ‘ఇదే అంశం 2024లో సుప్రీంకోర్టు ముందుకు వచ్చినప్పుడు ఓ పర్యవేక్షణ కమిటీని నియమించాం. ఆ కమిటీ చేసిన సిఫారసులను ఎన్‌టీఏ నాడు ఆమోదించింది కూడా. అయినా ప్రశ్నప్రతం మళ్లీ లీక్ అయింది. కమిటీ సిఫారసులను ఏ మేరకు అమలు చేశారనేదానిపై గురువారం లోగా అఫిడవిట్ సమర్పించండి’’ అని ఎన్‌టీఏను ఆదేశించింది. అదే సమయంలో, కోర్టు మార్గదర్శకాలను ఎన్‌టీఏ అమలుచేస్తున్న తీరును పరిశీలించాల్సిందిగా ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వంలో నియమించిన కమిషన్‌ను నిర్దేశించింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై స్పందించాలంటూ ఎన్‌టీఏతోపాటు కేంద్రం, సీబీఐకి నోటీసులు జారీచేసింది. ఈ నెల మూడో తేదీన బయటపడిన నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది.