Share News

న్యాయవ్యవస్థలో అవినీతి పేరిట పాఠ్యాంశం! ఎన్‌సీఈఆర్‌టీ బుక్‌పై సుప్రీం కోర్టు నిషేధం

ABN , Publish Date - Feb 26 , 2026 | 12:48 PM

న్యాయవ్యవస్థలో అవినీతి పేరిట ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకంలో పాఠ్యాంశాన్ని చేర్చడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పుస్తకంపై నిషేధాన్ని విధించింది. ఎన్‌సీఈఆర్‌టీ చైర్మన్, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

న్యాయవ్యవస్థలో అవినీతి పేరిట పాఠ్యాంశం! ఎన్‌సీఈఆర్‌టీ బుక్‌పై సుప్రీం కోర్టు నిషేధం
Supreme Court NCERT controversy

ఇంటర్నెట్ డెస్క్: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ పాఠ్యాంశాన్ని 8వ తరగతి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకంలో చేర్చడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్‌సీఈఆర్‌టీ బాధ్యతవహించాల్సిందేనని స్పష్టం చేసింది. ‘మరింత లోతైన విచారణ జరగాలి. బాధ్యులు ఎవరో తేలాలి. వారు మూల్యం చెల్లించుకోవాల్సిందే. కేసును మేము క్లోజ్ చేయము’’ సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాకుండా, భారత్‌తో పాటు విదేశాల్లోనూ ఆ పుస్తకాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రతులను వెంటనే సీజ్ చేయాలని పేర్కొంది. ఆన్‌లైన్‌లో కూడా ఆ పుస్తకాన్ని విక్రయించడంపై నిషేధించింది. అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్‌సీఈఆర్‌టీ చైర్మన్‌కూ నోటీసులు జారీ చేసింది.

అంతకుముందు, సొలిసిటర్ జనరల్ తన వాదనలు వినిపిస్తూ ఈ ఉదంతానికి బాధ్యులైన వారు ఇకపై ఎన్‌సీఈఆర్‌టీతో పాటు ఏ మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేయబోరని తెలిపారు. తమ మద్దతు న్యాయవ్యవస్థకేనని అన్నారు. బాధ్యులు ఎవరూ తప్పించుకోలేరని హామీ ఇచ్చారు. అయితే, ప్రధాన న్యాయమూర్తి మాత్రం ఈ చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చర్యలతో ఎలాంటి ఫలితం ఉండదని అన్నారు. ‘వారు తొలి తూటాను పేల్చారు. న్యాయవ్యవస్థకు గాయమైంది. రక్తం కారుతోంది. దీని వెనుక ఏదో లోతైన కుట్ర ఉన్నట్టు అనిపిస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారం చేసినట్టు ఉంది’ అని అన్నారు.


ఎన్‌సీఈఆర్‌టీ తాజాగా క్షమాపణలు చెప్పిన తీరుపై కూడా చీఫ్ జస్టిస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంలో అనుకోకుండా పొరపాటు జరిగిందని ఎన్‌సీఈఆర్‌టీ తన ప్రకటనలో పేర్కొంది. సరైన నిర్ణయం తీసుకోనందుకు విచారిస్తున్నామని వ్యాఖ్యానించింది. అయితే, న్యాయస్థానం మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము ఆశించిన స్థాయిలో క్షమాపణ లేదని పేర్కొంది. ఈ విషయాన్ని తుషార్ మెహతా ప్రస్తావిస్తూ విచారణ మొదట్లోనే తాము బేషరతుగా క్షమాపణ చెబుతున్నామని అన్నారు. అయితే, ఆయన కామెంట్స్‌తో చీఫ్ జస్టిస్ విభేదించారు. ఎన్‌సీఈఆర్‌టీ ప్రకటనపై మీడియా కథనాలను ఉటంకిస్తూ ఆ ప్రకటనలో క్షమాపణ అన్న పదమే లేదని పెదవి విరిచారు.

ఈ అంశంపై బుధవారం కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా స్పందించాయి. సంబంధిత పాఠ్యాంశాన్ని తొలగిస్తామని పేర్కొన్నాయి. ఈ పాఠానికి బదులు స్ఫూర్తిమంతమైన ఇతర కథనాలు చేర్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాయి.


ఈ వార్తలూ చదవండి:

దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్.. నేటి నుంచి నామినేషన్లు

ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

Updated Date - Feb 26 , 2026 | 01:35 PM