కేరళీయులకు ఇంగ్లిషు వచ్చినా మాట్లాడరు
ABN , Publish Date - May 22 , 2026 | 03:35 AM
కేరళీయులకు ఇంగ్లిషు వచ్చినా మాట్లాడరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేరళలో భాషాపరమైన సమస్య ఉందన్న పిటిషనర్ వాదనతో ఏకీభవిస్తూ విడాకుల కేసును లుథియానా...
సుప్రీంకోర్టు వ్యాఖ్య.. భాషాపరమైన సమస్య అంటూ విడాకుల కేసు పంజాబ్‌కు బదిలీ
న్యూఢిల్లీ, మే 21: కేరళీయులకు ఇంగ్లిషు వచ్చినా మాట్లాడరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేరళలో భాషాపరమైన సమస్య ఉందన్న పిటిషనర్ వాదనతో ఏకీభవిస్తూ విడాకుల కేసును లుథియానా(పంజాబ్)కు బదిలీ చేసింది. 2017లో పెళ్లైన ఓ జంట 2023 వరకు కలిసి జీవించింది. తర్వాత బ్రిటన్ వెళ్లిన కొన్నాళ్లకు విడిపోయింది. మైనర్ అయిన బిడ్డను తీసుకుని భర్త ఇండియాకు వచ్చేశారు. భార్య మాత్రం బ్రిటన్‌లోనే ఉంటున్నారు. విడాకులు, బిడ్డ సంరక్షణ హక్కు కోరుతూ భర్త కేరళలో కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణను కేరళ నుంచి పంజాబ్‌కు బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో భార్య పిటిషన్ దాఖలు చేశారు. భాషాపరమైన సమస్య వల్ల తన క్లయింట్ కేరళలో ప్రభావవంతంగా వాదన వినిపించలేకపోతున్నారని ఆమె తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ఆమె తరఫున కోర్టు వ్యవహారాలు చూసుకుంటున్న ఆమె తల్లి కూడా ఇదే సమస్య ఎదుర్కొంటున్నారని చెప్పారు. దీన్ని విభేదిస్తూ కేరళలో అందరూ ఇంగ్లిషు మాట్లాడతారని, అక్కడ ఎలాంటి భాషాపరమైన సమస్యలు లేవని భర్త తరఫు న్యాయవాది వాదించారు. అయితే ఈ వాదనను జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం తోసిపుచ్చింది. ‘మాకు చెప్పొద్దు. అక్కడ పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది. వారికి ఇంగ్లిషు తెలిసినా మాట్లాడర’ని వ్యాఖ్యానించింది. నిష్పాక్షిక విచారణకు భాషా సౌలభ్యం చాలా కీలకమని, అందరికీ ఇంగ్లిషు వచ్చు అనే అంచనాకు రాలేమని పేర్కొంది.