ప్రభుత్వ ఉద్యోగి 48గంటలు కస్టడీలో ఉంటే సస్పెండయినట్టే
ABN , Publish Date - Nov 10 , 2026 | 03:09 AM
ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకుపైగా జ్యుడీషియల్ కస్టడీలో ఉంటే ఆ వ్యక్తి సస్పెండయినట్టేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వాల్సిన పనిలేదని తీర్పు ఇచ్చింది.
ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదు: సుప్రీం
న్యూఢిల్లీ, నవంబరు 9: ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకుపైగా జ్యుడీషియల్ కస్టడీలో ఉంటే ఆ వ్యక్తి సస్పెండయినట్టేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వాల్సిన పనిలేదని తీర్పు ఇచ్చింది. బిహార్‌కు చెందిన ప్రభుత్వ ఆస్పత్రి అధికారి విశ్వజీత్ సింగ్‌కు బెయిల్‌ను పునరుద్ధరిస్తూ ఈ స్పష్టత ఇచ్చింది. సమస్తిపూర్ సదర్ ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ విశ్వజీత్ గత ఏడాది ఓ కాంట్రాక్టు ఉద్యోగికి పెండింగ్ జీతం కింద చెల్లించాల్సిన రూ.36,421 కోసం రూ.4,000 లంచం డిమాండ్ చేశాడు. అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకొని అరెస్టు చేయడంతో 15 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. దీనిపై తొలుత విచారణ జరిపిన జిల్లా సెషన్స్ కోర్టు...తీసుకున్న మొత్తం చాలా తక్కువ అన్న కారణం చూపి బెయిల్ ఇచ్చింది. ఆ కాంట్రాక్టు ఉద్యోగి హైకోర్టును ఆశ్రయించగా ఏడాది తరువాత ఆ బెయిల్‌ను రద్దు చేసింది. దాంతో ఆ అధికారి సుప్రీంకోర్టులో అప్పీలు చేశాడు. విచారణ జరిపిన ధర్మాసనం.. హైకోర్టు వ్యాఖ్యలు సరైనవే అయినప్పటికీ సస్పెండయిన దృష్ట్యా ఈ కేసులో బెయిల్ ఇచ్చుంటే బాగుండేదని తెలిపింది.