మహిళా ఆర్మీ అధికారులు పెన్షన్‌కు అర్హులే: సుప్రీం
ABN , Publish Date - Mar 25 , 2026 | 03:35 AM
దేశ రక్షణ రంగంలో సేవలందిస్తున్న మహిళా అధికారుల పట్ల దశాబ్దాలుగా కొనసాగుతున్న వివక్షకు సుప్రీంకోర్టు తెర దించింది. త్రివిధ దళాల్లో షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ) కింద...
న్యూఢిల్లీ, మార్చి 24: దేశ రక్షణ రంగంలో సేవలందిస్తున్న మహిళా అధికారుల పట్ల దశాబ్దాలుగా కొనసాగుతున్న వివక్షకు సుప్రీంకోర్టు తెర దించింది. త్రివిధ దళాల్లో షార్ట్ సర్వీస్ కమిషన్(ఎ్‌సఎ్‌ససీ) కింద 14 ఏళ్లు పనిచేసి, వివక్షతో కూడిన అసె్‌సమెంట్ వల్ల శాశ్వత కమిషన్(పర్మినెంట్ కమిషన్) హోదా పొందే అవకాశం కోల్పోయిన మహిళా అధికారులకు పూర్తి పెన్షన్ ప్రయోజనాలు కల్పించాలని మంగళవారం తీర్పునిచ్చింది. పెన్షన్ పొందేందుకు 20ఏళ్ల సర్వీసు నిబంధన అమలులో ఉన్నప్పటికీ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తన ప్రత్యేకాధికారాలను వినియోగించిన కోర్టు ఈ అధికారిణులకు వన్‌టైం రిలీఫ్ కింద ఈ వెసులుబాటు కల్పించింది. పర్మినెంట్ కమిషన్ కోసం దరఖాస్తు చేసుకుని సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురైన మహిళా అధికారులను 20ఏళ్ల అర్హత సర్వీసు ఉన్నట్లుగానే పరిగణించాలని ధర్మాసనం ఆదేశించింది. వింగ్ కమాండర్ సుచేత మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళా అధికారుల వార్షిక పనితీరు నివేదికలను గతంలో చాలా నిర్లక్ష్యంగా రాసేవారని తప్పుబట్టింది. ‘‘వారు ఎలాగూ కెరీర్‌లో పైస్థాయికి వెళ్లరు. శాశ్వత కమిషన్ రాదు’’ అనే ముందస్తు భావనతో రేటింగ్స్ తగ్గించడం వల్ల వారి మెరిట్ దెబ్బతిందని కోర్టు అభిప్రాయపడింది. 2019 నుంచి 2021 సెలక్షన్ బోర్డుల్లో శాశ్వత నియామకానికి పరిగణించిన ఎస్‌ఎ్‌ససీ అధికారిణులందరికీ ఈ తీర్పు వర్తిస్తుందని స్పష్టం చేసింది. నవంబర్ 1, 2025 నుంచి ఈ పెన్షన్ అమలు చేయాలని పేర్కొంది.