Share News

ఆ బాలిక మీద జరిగింది అత్యాచార యత్నమే!

ABN , Publish Date - Feb 19 , 2026 | 04:05 AM

మహిళ పైజామా నాడా లాగటం, రొమ్ములను తడమటం.. అత్యాచారయత్నం కిందికే వస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఆ బాలిక మీద జరిగింది అత్యాచార యత్నమే!

  • పైజామా నాడా లాగటాన్ని ఆ విధంగానే పరిగణించాలి

  • యూపీ బాలిక ఉదంతంపై సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: మహిళ పైజామా నాడా లాగటం, రొమ్ములను తడమటం.. అత్యాచారయత్నం కిందికే వస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అటువంటి చర్యలను అత్యాచారం చేయటానికి సిద్ధమవటంగానే చూడాలి గానీ అత్యాచారయత్నంగా నిర్ధారించలేమన్న అలహాబాద్‌ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. 2021 నవంబరు 10వ తేదీన యూపీకి చెందిన ఒక మహిళ 14 ఏళ్ల వయసున్న తన కుమార్తెతో బంధువుల ఇంటికి వెళ్లి.. తిరిగి తమ ఇంటికి నడిచి వస్తుండగా.. తమ గ్రామానికే చెందిన పవన్‌, ఆకాశ్‌, అశోక్‌ అనే ముగ్గురు యువకులు బైకు మీద వస్తూ వారికి తారసపడ్డారు. బాలికను బైక్‌ మీద ఇంటి వరకూ తీసుకెళ్తామని చెబితే, వారిని నమ్మి ఆ మహిళ కుమార్తెను వారితో పంపింది. కానీ, ఆ యువకులు ఆ బాలికను దారిలో ఓ కల్వర్టు కిందికి తీసుకెళ్లి.. ఆమె రొమ్ములు నిమరటం, పైజామా లాగే ప్రయత్నం చేయటం వంటి దుశ్చర్యకు పాల్పడ్డారు. బాలిక కేకలు వేయటంతో.. దారిన వెళ్తున్న కొందరు వచ్చి ఆమెను కాపాడారు. దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై బాలిక తల్లి.. యూపీలోని కాస్‌గంజ్‌ పోక్సో ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ వేయగా.. నిందితుల్లో ఇద్దరిపై అత్యాచార యత్నం కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. 2023 జూన్‌లో ఈ ఉత్తర్వులు రాగా.. వాటిని నిందితులు అలహాబాద్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై 2025 మార్చిలో జస్టిస్‌ రాం మనోహర్‌ మిశ్రా తీర్పునిస్తూ.. నిందితుల చర్యను అత్యాచారానికి సిద్ధపడుతున్న ఘటనగానే పరిగణించాలిగానీ.. రేప్‌ యత్నంగా చూడవద్దంటూ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు మీద అప్పట్లో తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. హైకోర్టు తీర్పు నేరవిచారణ నిబంధనలను తప్పుడుగా అన్వయించినట్లు తేలుతోందని, కాబట్టే, ఆ తీర్పును కొట్టేస్తున్నామని తెలిపింది. పోక్సో కోర్టు విచారణ కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - Feb 19 , 2026 | 05:52 AM