Share News

ఆదాయం ఒక్కటే సంపన్న శ్రేణికి కొలమానం కాదు

ABN , Publish Date - Mar 14 , 2026 | 04:41 AM

ఉద్యోగాల్లో ఓబీసీ సంపన్న శ్రేణి(క్రీమీలేయర్‌) రిజర్వేషన్ల వర్తింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సంపన్న శ్రేణి నిర్ధారణకు కేవలం తల్లిదండ్రుల ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటే సరిపోదని....

ఆదాయం ఒక్కటే సంపన్న శ్రేణికి కొలమానం కాదు

  • ఉద్యోగాల స్థాయి కూడా చూడాలి.. జీతం పెరిగినా సామాజిక హోదా పెరగదు: సుప్రీంకోర్టు

  • ఓబీసీ క్రీమీలేయర్‌ రిజర్వేషన్లపై వివరణ

న్యూఢిల్లీ, మార్చి 13: ఉద్యోగాల్లో ఓబీసీ సంపన్న శ్రేణి(క్రీమీలేయర్‌) రిజర్వేషన్ల వర్తింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సంపన్న శ్రేణి నిర్ధారణకు కేవలం తల్లిదండ్రుల ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటే సరిపోదని, ఆ ఉద్యోగాల హోదా, కేటగిరీలను కూడా చూడాలని స్పష్టం చేసింది. తల్లిదండ్రుల ఆదాయం నిర్ణీత పరిధిని దాటినందున వారి పిల్లలు సంపన్నశ్రేణిలోకి వస్తారని, ఓబీసీ రిజర్వేషన్లు వారికి వర్తించవంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన వాదనను తిరస్కరించింది. ఈ మేరకు జస్టిస్‌ పి.ఎ్‌స.నరసింహ, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌ల ధర్మాసనం గురువారం తీర్పు ఇచ్చింది. ధర్మాసనం తరఫున జస్టిస్‌ మహదేవన్‌ తీర్పు రాశారు. యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినా, తల్లిదండ్రుల ఆదాయం ప్రకారం చూస్తే నాన్‌క్రీమీలేయర్‌ పరిధిలోకి రారని, అందువల్ల ఓబీసీ రిజర్వేషన్లు వర్తించవంటూ కొందరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. బాధిత అభ్యర్థులు పలు హైకోర్టులు, ట్రైబ్యునళ్లను ఆశ్రయించగా అనుకూలంగా తీర్పులు వచ్చాయి. వీటిని సవాలు చేస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. కింది కోర్టుల తీర్పులను సమర్థించిన ధర్మాసనం...కేవలం ఆదాయాన్నే కాకుండా ఉద్యోగాల హోదాను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది.


ఓబీసీల్లో క్రీమీలేయర్‌ను గుర్తించే విషయమై 1993లో కేంద్ర ప్రభుత్వం ఆఫీస్‌ మెమొరరాండం జారీ చేసింది. దీనిపై సందేహాలను నివృత్తి చేస్తూ 2004లో మరో లేఖ పంపించింది. 1993 నాటి ఆఫీసు మెమొరాండంలో ఓబీసీల్లో సామాజికంగా అభివృద్ధి చెందిన వర్గాలను క్రీమీలేయర్‌గా గుర్తింపునకు సంబంధించిన విధివిధానాలు ఉన్నాయి. 2004నాటి లేఖలో కేవలం తల్లిదండ్రుల ఆదాయం ఆధారంగా సంపన్నశ్రేణిని గుర్తింపునకు సంబంఽధించిన సమాచారం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలోని లేని తల్లిదండ్రుల ఆదాయాన్ని లెక్కించే విధానం ఉంది. వాటి ఆధారంగా గ్రూప్‌ ఏ/క్లాస్‌-1 ప్రభుత్వ ఉద్యోగాలు, కొన్ని రకాల గ్రూప్‌ బీ/క్లాస్‌-2 ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారి పిల్లలు ఓబీసీ రిజర్వేషన్లకు అర్హులు కారు. వారిని సంపన్న శ్రేణిగా పరిగణిస్తారు. ఆ ఉద్యోగాల కారణంగా సామాజిక హోదా పెరిగినందున రిజర్వేషన్లు అవసరం లేదని ప్రభుత్వం భావించింది. ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ పోస్టులకు సమానమైన ఉద్యోగాలను గుర్తించడం కష్టమైనప్పుడు ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ప్రభుత్వ సంస్థల్లో లేని వారికి కూడా వార్షిక ఆదాయమే ప్రాతిపదికగా ఉంటుంది. ఆ మేరకు వార్షిక ఆదాయం రూ.8 లక్షలకన్నా తక్కువ ఉన్న వారిని నాన్‌ క్రీమీలేయర్‌గా పరిగణించి ఓబీసీ రిజర్వేషన్లు ఇస్తున్నారు. రూ.8 లక్షలు దాటితే సంపన్న శ్రేణిగా ముద్రవేస్తున్నారు. ఇక్కడే సమస్య తలెత్తడంతో సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. 2004 నాటి లేఖను ఆధారం చేసుకొని కేవలం ఆదాయపరిమితినే పరిగణనలోకి తీసుకోవడం సరికాదని తెలిపింది. 2004 నాటి లేఖకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి, తల్లిదండ్రుల సామాజిక హోదా, ఉద్యోగం కేటగిరీని పట్టించుకోకపోవడం అంటే 1993 నాటి మెమొరాండంలో పేర్కొన్న విధివిధానాలను విస్మరించడమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. కాలక్రమేణా కొన్ని ఉద్యోగాల జీతాలు పెరుగుతాయని, కానీ వాటి సామాజిక హోదా పెరగదని తెలిపింది. అందువల్ల జీతాలు, వ్యవసాయం, ఇతర మార్గాలు ద్వారా వచ్చే జీతాలను యాంత్రికంగా లెక్కించి దాని ఆధారంగా సంపన్న శ్రేణిలో ఉన్నారని భావించడం సరికాదని పేర్కొంది. గ్రూప్‌ సి, డి కేటగిరీల ఉద్యోగుల వార్షిక ఆదాయం నిర్ణీత పరిధిని దాటినప్పటికీ వారిని ఆటోమేటిక్‌గా సంపన్న శ్రేణి కింద చూడకూడదని, రిజర్వేషన్ల పరిధి నుంచి మినహాయించకూడదని తెలిపింది. బాఽధిత అభ్యర్థులకు ఆరు నెలల్లో ఉద్యోగాలు ఇవ్వాలని, అవసరమైతే అదనపు పోస్టులు సృష్టించాలని ఆదేశించింది.

Updated Date - Mar 14 , 2026 | 04:41 AM