దర్యాప్తు ప్రాథమిక దశలో విచారణ రద్దు చేయలేరు
ABN , Publish Date - Apr 15 , 2026 | 04:00 AM
దర్యాప్తు ప్రాథమిక దశలో హైకోర్టుల జోక్యం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రాథమికంగా నేరం జరిగినట్లుగా ఫిర్యాదులో ఆధారాలు ఉన్నప్పుడు.
కర్ణాటక హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): దర్యాప్తు ప్రాథమిక దశలో హైకోర్టుల జోక్యం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రాథమికంగా నేరం జరిగినట్లుగా ఫిర్యాదులో ఆధారాలు ఉన్నప్పుడు.. మెజిస్ట్రేట్ ఆదేశించిన పోలీసు దర్యాప్తును ఆదిలోనే హైకోర్టులు రద్దు చేయడం సరికాదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితులు సమర్పించే రక్షణ సాక్ష్యాలను(ఢిఫెన్స్ ఎవిడెన్స్) పరిగణనలోకి తీసుకుని విచారణను అడ్డుకోవడం చెల్లదని పేర్కొంది. ఈ మేరకు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఓ కేసు రద్దు ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. మళ్లీ మొదటి నుంచి దర్యాప్తు నిర్వహించాలని ఆదేశించింది. జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘నిందితులు సమర్పించిన పత్రాలు, సేల్ డీడ్లను పరిశీలించి వాస్తవాలను నిర్థారించడం దర్యాప్తు సంస్థల పని. లేదంటే కోర్టు విచారణ సమయంలో జరగాలి. అంతకంటే ముందే హైకోర్టులు వాటిని ప్రామాణికంగా తీసుకుని కేసును కొట్టివేయడం చట్టవిరుద్థం’’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. కేసు సివిల్ వివాదమే కదా? అని క్రిమినల్ దర్యాప్తును ఆపలేమంది.