Share News

జగన్‌ అక్రమాస్తుల కేసులో ‘వాన్‌పిక్‌’కు సుప్రీంలో చుక్కెదురు

ABN , Publish Date - Feb 11 , 2026 | 02:55 AM

వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో వాన్‌పిక్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ కేసులను కొట్టివేయడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.

జగన్‌ అక్రమాస్తుల కేసులో ‘వాన్‌పిక్‌’కు సుప్రీంలో చుక్కెదురు

  • సీబీఐ కేసుల కొట్టివేతకు నిరాకరణ

  • హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో వాన్‌పిక్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ కేసులను కొట్టివేయడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. వాన్‌పిక్‌ ప్రాజెక్టులపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి రికార్డులను పరిశీలించిన తర్వాత కేసుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, సీబీఐ మోపిన అభియోగాలపై విచారణను కింది కోర్టులో ఎదుర్కొని తేల్చుకోవాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వాన్‌పిక్‌ గతేడాది అక్టోబరు 28న సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఆ పిటిషన్‌ను మంగళవారం జస్టిస్‌ ఎం.ఎం. సుందరేశ్‌ నేతృత్వంలో జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. వాన్‌పిక్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ అగర్వాల్‌ వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంలో సమగ్ర విచారణ జరపాలని గతంలోనే హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించిందని, అయితే, తమ వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. సీబీఐ మోపిన అభియోగాలపై దిగువ కోర్టులోనే తేల్చుకోవాలని చెప్పిందని, అసలు నేరం ఏమిటో?, ఏ సెక్షన్ల కింద విచారిస్తున్నారో కూడా పేర్కొనలేదని చెప్పారు. కనీసం నేరమేమిటో చెప్పకుండా విచారణను ఎదుర్కోవాల్సిందేనని చెప్పడం సరికాదన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. హైకోర్టు ఉత్తర్వుల్లో కలుగజేసుకోలేమని తేల్చి చెప్పింది. హైకోర్టులోనే సమగ్ర వాదనలు వినిపించాలని గతంలో సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడే సూచించామని గుర్తు చేసింది. ‘హైకోర్టు ఇరుపక్షాల వాదనల తర్వాతే ఉత్తర్వులు ఇచ్చింది కదా! ప్రస్తుతానికి ఈ విషయంలో జోక్యం చేసుకోలేం’ అంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

కేసు పూర్వాపరాలు ఇవీ..

2008లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని తీర మండలాల్లో వాడరేవు-నిజాంపట్నం పారిశ్రామిక కారిడార్‌(వాన్‌పిక్‌) ప్రాజెక్టు కోసం 22 వేల ఎకరాలను ేసకరించారు. ఆ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని సీబీఐ కేసులు నమోదు చేయడంతో ప్రాజెక్టు నిలిచిపోయింది. భూముల కేటాయింపునకు ప్రతిఫలంగా నాటి సీఎం కుమారుడు వైఎస్‌ జగన్‌కు చెందిన కంపెనీల్లో నిమ్మగడ్డ ప్రసాద్‌ రూ.854 కోట్ల పెట్టుబడులు పెట్టారని, ఇది క్విడ్‌ ప్రోకో కిందకు వస్తుందని సీబీఐ అభియోగపత్రంలో పేర్కొంది. సీబీఐ కేసులను కొట్టివేయాలంటూ వాన్‌పిక్‌ ప్రాజెక్ట్స్‌ 2021లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేయగా కేసులను కొట్టివేస్తూ 2022 జూలైలో వాన్‌పిక్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ తీర్పును సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా.. కేసును కొట్టివేయడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కేసు పూర్వాపరాలపై మరోసారి సమగ్రంగా విచారించి తీర్పు ఇవ్వాలంటూ తిరిగి హైకోర్టుకు పంపింది. రికార్డులను పరిశీలించిన తర్వాత కేసుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, సీబీఐ మోపిన అభియోగాలపై విచారణను కింది కోర్టులో ఎదుర్కొని తేల్చుకోవాలని పేర్కొంటూ హైకోర్టు 2025 ఆగస్టు 26న తీర్పు వెలువరించింది. ఆ తీర్పుపై వాన్‌పిక్‌ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించగా జోక్యం చేసుకోలేమంటూ తాజాగా పిటిషన్‌ను తోసిపుచ్చింది.

Updated Date - Feb 11 , 2026 | 02:55 AM