అంతర్రాష్ట్ర బదిలీ ఉద్యోగుల సీనియారిటీ పిటిషన్ కొట్టివేత
ABN , Publish Date - Nov 27 , 2026 | 05:13 AM
అంతర్రాష్ట్ర బదిలీల ద్వారా తెలంగాణకు వచ్చిన ప్రభుత్వోద్యోగుల సీనియారిటీ వివాదంపై దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ)లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
న్యూఢిల్లీ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): అంతర్రాష్ట్ర బదిలీల ద్వారా తెలంగాణకు వచ్చిన ప్రభుత్వోద్యోగుల సీనియారిటీ వివాదంపై దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ)లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బదిలీ నిబంధనలకు అంగీకరించి, సీనియారిటీని వదులుకుంటామని లిఖితపూర్వక హామీ (అండర్‌టేకింగ్) ఇచ్చిన తర్వాత ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం. పంచోలిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తమ సీనియారిటీని 2018 జాబితా కంటే దిగువన ఖరారు చేయడాన్ని సవాలుచేస్తూ ఇంజనీర్-ఇన్-చీఫ్ (అడ్మినిస్ట్రేషన్ వింగ్) పరిధిలో పనిచేస్తున్న ఎం. సునీత, బి. మధుబిందు, ఎర్ర సవిత, ఎం. భాగ్యశ్రీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, రెండు రాష్ట్రాల ఇంజనీర్-ఇన్-చీఫ్‌లను ప్రతివాదులుగా చేరుస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్లను ధర్మాసనం డిస్మిస్ చేసింది.