Share News

ఓట్ల లెక్కింపులో కేంద్ర సిబ్బంది నియామకంపై మమతకు సుప్రీంకోర్టులో చుక్కెదురు..!

ABN , Publish Date - May 03 , 2026 | 04:01 AM

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది.

ఓట్ల లెక్కింపులో కేంద్ర సిబ్బంది నియామకంపై మమతకు సుప్రీంకోర్టులో చుక్కెదురు..!

న్యూఢిల్లీ, మే 2: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. బెంగాల్‌లో ఓట్ల లెక్కింపునకు కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని మోహరించడాన్ని సవాల్‌ చేస్తూ టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ పీఎస్‌ నరసింహాన్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చిల ధర్మాసనం తోసిపుచ్చింది. ఈనెల 4న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మిశ్రమ వినియోగానికి వీలు కల్పిస్తూ ఏప్రిల్‌ 13న భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) జారీ చేసిన సర్క్యులర్‌ ఏ మాత్రం చట్ట విరుద్ధం కాదని పేర్కొంది. ఆయా రెండు వర్గాల నుంచి లెక్కింపు సిబ్బందిని నియమించుకునే విచక్షణాధికారం ఈసీఐకి ఉందని స్పష్టం చేసింది. కౌంటింగ్‌ కేంద్రాల్లో సూపర్‌వైజర్లుగా రాష్ట్ర ఉద్యోగులను విస్మరించి, కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థ (పీఎ్‌సయూ)ల ఉద్యోగులను నియమించడం ద్వారా ఈసీఐ ఉద్దేశపూర్వకంగా కేంద్రంలోని అధికార బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ టీఎంసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్రంలోని పార్టీకి విధేయులుగా ఉంటారన్న టీఎంసీ వాదన వట్టి అపోహేనని కోర్టు పేర్కొంది. ఏదేమైనా వారు ప్రభుత్వ ఉద్యోగులని.. ఎన్నికల సమయంలో ఈసీఐ నియంత్రణలోనే పనిచేస్తారని స్పష్టం చేసింది.

Updated Date - May 03 , 2026 | 04:01 AM