ప్రజలు తిరస్కరించినా ప్రచారం కోసం ప్రయత్నమా?
ABN , Publish Date - Feb 07 , 2026 | 03:57 AM
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన జన్‌సురాజ్ పార్టీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రద్దు చేసి..
జన్‌సురాజ్ పార్టీకి సుప్రీంకోర్టు చురకలు
‘అసెంబ్లీ ఎన్నికల రద్దు’ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన జన్‌సురాజ్ పార్టీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రద్దు చేసి.. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ‘మీ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. అయినా మీరు ప్రచారం కోసం న్యాయ వేదికను వాడుకోవాలనుకుంటున్నారా..?’ అంటూ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. గతేడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 238 స్థానాల్లో పోటీకి దిగిన జన్‌సురాజ్ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయింది. 202 స్థానాలను దక్కించుకొని ఎన్డీయే అధికారాన్ని నిలుపుకొంది. అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత..ఎన్డీయే ప్రభుత్వం సీఎం మహిళా రోజ్‌గార్ యోజన కింద మహిళలకు రూ.10 వేల చొప్పున నగదు బదిలీ చేసి ఎన్నికల నియమావళిని ఉల్లఘించిందని జన్‌సురాజ్ పార్టీ తన పిటిషన్‌లో ఆరోపించింది. ఎన్నికలు చెల్లవంటూ ప్రకటించాలని కోర్టును కోరింది. అయితే ఈ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.