Share News

తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్‌లైనా పిల్లలకు రిజర్వేషన్లు కావాలా?

ABN , Publish Date - May 23 , 2026 | 04:05 AM

వెనకబడిన తరగతుల్లోని ఆర్థికంగా, విద్యాపరంగా ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్‌లైనా పిల్లలకు రిజర్వేషన్లు కావాలా?

  • ఎవరికి వారు పునఃపరిశీలించుకోవాలి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, మే 22: వెనకబడిన తరగతుల్లోని ఆర్థికంగా, విద్యాపరంగా ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలాంటి వారు కూడా రిజర్వేషన్లు కొనసాగించాలని కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి తల్లిదండ్రులిద్దరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయినందున క్రీమీలేయర్‌ కిందకు వస్తారని.. రిజర్వేషన్‌ వర్తించదంటూ ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఒకవేళ తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్‌ అధికారులైతే, ఇంకా వారికి రిజర్వేషన్లు ఎందుకు? విద్య, ఆర్థికపరంగా సాధికారత సాధించినప్పుడు సామాజికంగా ఉన్నత స్థితిలో ఉంటారు. అలాంటప్పుడు మళ్లీ వారి పిల్లలకు రిజర్వేషన్లు కోరితే ఎలా? అలాగైతే రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి ఎప్పటికీ బయటపడలేం’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తల్లిదండ్రులు ఉన్నత స్థాయికి చేరిన తర్వాత పిల్లల పరిస్థితి కూడా మారుతుందని.. రిజర్వేషన్ల అమలులో సమతుల్యత అవసరమని జస్టిస్‌ నాగరత్న అన్నారు. రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొంది.. సామాజిక, ఆర్థిక సాధికారిత సాధించాక, తమ కుటుంబంలోని తర్వాతి తరానికీ రిజర్వేషన్‌ పొందే విషయంలో ఎవరికి వారు పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. ఉన్నత స్థితికి చేరుకున్న కుటుంబాలు కూడా పదేపదే రిజర్వేషన్‌ ప్రయోజనాలు పొందడంపై ఆందోళన వ్యక్తం చేసింది. మంచి ఉద్యోగాలు చేసుకుంటూ బాగా సంపాదించే వారి పిల్లలకు రిజర్వేషన్లు అక్కర్లేదని, గతంలో అనేక ఉత్తర్వులు ఇచ్చామని గుర్తు చేసింది.

Updated Date - May 23 , 2026 | 04:05 AM