Supreme Court: కుక్కలపై ప్రేమ.. మనుషులపై ఏదీ?
ABN , Publish Date - Jan 14 , 2026 | 06:27 AM
వీధి కుక్కలకు తిండి పెడుతున్నామనేవారు.. వాటిని తమ ఇళ్లకు తీసుకెళ్లి ఆ పని చేయాలని సుప్రీంకోర్టు సూచించింది.
వీధి కుక్కలకు తిండి పెట్టాలంటే ఇళ్లకు తీసుకుపొండి.. అవి బయట జనాన్ని కరవడమెందుకు?
శునకప్రియులకు సర్వోన్నత న్యాయస్థానం సూచన
న్యూఢిల్లీ, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): వీధి కుక్కలకు తిండి పెడుతున్నామనేవారు.. వాటిని తమ ఇళ్లకు తీసుకెళ్లి ఆ పని చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. కుక్కల మీద ప్రేమలో కాస్తంతైనా మనషులపై ముఖ్యంగా అనాథ పిల్లల మీద ఎందుకు చూపించడం లేదని కుక్కల తరపున వాదిస్తున్న న్యాయవాదులను ప్రశ్నించింది. ఇక నుంచి ప్రతికుక్క కాటుకు, ప్రతి ప్రాణనష్టానికి రాష్ట్రప్రభుత్వాలే బాధ్యత వహించి భారీ పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. అలాగే, కుక్కలకు ఆహారం పెట్టేవారు కూడా బాధ్యత వహించేలా ఆదేశాలు ఇస్తామని తెలిపింది. వీధికుక్కల తరపున చాలమంది న్యాయవాదులు వాదిస్తున్నారని, కానీ మనషుల తరపున వాదించేవారు ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేసింది. కుక్కకాటు వల్ల పిల్లలు, వృద్ధులు చనిపోతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించింది. గేటెడ్ కమ్యూనిట్లీల్లో 95ు మందికి ఇష్టం లేకపోయినా, కేవలం 5ు మంది కుక్కల ప్రేమికుల కోసం అందరూ భయపడుతూ బతకాలా? అని కోర్టు నిలదీసింది. వీధికుక్కలను ప్రత్యేక షెల్టర్లకు తరలించాలంటూ నిరుడు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ‘‘తొమ్మిదేళ్ల ఓ చిన్నారిపై కుక్క దాడి చేస్తే.. దానికి బాధ్యులెవరు? వీధికుక్కలకు తిండి పెడుతున్న సంస్థా? ఈ సమస్యను మేం కళ్లు మూసుకుని పట్టించుకోకుండా ఉండాలని మీరు కోరుకుంటున్నారా?’’ అని జస్టిస్ సందీప్ మెహతా ప్రశ్నించారు. అలాగే.. వీధికుక్కలను సంరక్షించే, వాటికి తిండిపెట్టే మహిళలు వేధింపులకు గురవుతున్నారన్న ఫిర్యాదును పరిశీలించేందుకు కోర్టు తిరస్కరించింది. పోలీసు స్టేషన్లలో కేసు పెట్టొచ్చని సూచించింది.
మనుషుల గురించి వాదించట్లేదు..
ఢిల్లీలో దాదాపు 200 వీధికుక్కలకు ఆహారం పెడుతూ.. ‘డాగ్ అమ్మ’గా పేరొందిన 80 ఏళ్ల ప్రతిమాదేవి అనే వృద్ధురాలి తరఫున ఈ కేసులో సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది వైభవ్ గగ్గర్ వాదనలు వినిపించారు. వీధికుక్కల దత్తతపై ఒక విధానాన్ని పరిగణనలోకి తీసుకోవాలని.. ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. దీనికి జస్టిస్ సందీప్ మెహతా.. ‘‘నేను ఇక్కడికి పదోన్నతిపై 2011లో వచ్చా. అప్పట్నుంచీ ఇప్పటిదాకా నేను విన్న అతి సుదీర్ఘమైన వాదనలు ఇవే. ఇప్పటిదాకా మనుషుల గురించి, అనాథ పిల్లల దత్తత గురించి ఎవరూ ఇంతలా వాదించలేదు’’ అని తీవ్రవ్యాఖ్యలు చేశారు. ‘‘వీధికుక్కలకు సంబంధించిన అంశాలు భావోద్వేగపూరితమైనవి’’ అని మరో సీనియర్ న్యాయవాది మేనక పేర్కొనగా..‘‘ఆ భావోద్వేగాలు కేవలం కుక్కల పట్ల మాత్రమే కనిపిస్తున్నాయి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.విచారణను 20కి వాయిదా వేసింది.
వితంతు కోడలికి మామ నుంచి భరణం
మామకు చెందిన ఎస్టేట్ నుంచి వితంతువైన కోడలికి భరణం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మామ మరణించిన తరువాత కూడా ఆ ఎస్టేట్ ద్వారా భరణం పొందే హక్కు ఆమెకు ఉందని తెలిపింది. హిందూ లా ప్రకారం ఆశ్రితులను పోషించే బాధ్యత వారసులు అందరిపైనా ఉంటుందని తెలిపింది. ఆ వితంతువుకు ఆదాయ మార్గం లేనప్పుడు ఆమెను ఆశిత్రురాలిగా పరిగణించాలంది.