Share News

ఉచితాలు ఎంతకాలం?

ABN , Publish Date - Feb 20 , 2026 | 02:36 AM

పప్పు బెల్లాల్లా ఉచిత పథకాలను పంచిపెట్టడం పట్ల భారత సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సరిగ్గా ఎన్నికలకు ముందే ప్రభుత్వాలు ఎందుకు సంక్షేమ, ఉచిత కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నాయని .....

ఉచితాలు ఎంతకాలం?

  • రెవెన్యూలోటున్నా ఎలా ప్రకటిస్తున్నారు?

  • ఎన్నికలకు ముందే వరాలు బుజ్జగింపే!

  • దేశంలో ఏం జరుగుతోంది?.. ఈ తరహా

  • బృహత్తర పందేరాలతో ఆర్థికాభివృద్ధికి దెబ్బ

  • నిధులుంటే విద్యకు మళ్లించండి: సుప్రీంకోర్టు

  • తమిళనాడులో ఉచిత విద్యుత్‌పై ఆగ్రహం

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ

చెన్నై న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): పప్పు బెల్లాల్లా ఉచిత పథకాలను పంచిపెట్టడం పట్ల భారత సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సరిగ్గా ఎన్నికలకు ముందే ప్రభుత్వాలు ఎందుకు సంక్షేమ, ఉచిత కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నాయని ప్రశ్నించింది. ఇలా పంచుకుంటూ పోతే, అభివృద్ధి పనులకు పైసా కూడా మిగలదని వ్యాఖ్యానించింది. దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలిగించే విధానాలను పునఃసమీక్షించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపింది. తమిళనాడులో ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా అందరికీ 100 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని స్టాలిన్‌ ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం తమిళనాడు విద్యుత్‌ బోర్డ్‌ (టీఎన్‌ఈబీ) 23 ఆర్టికల్‌లోని నిబంధనలను సవరించేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ తమిళనాడు విద్యుత్‌ పంపిణీ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్‌ విపుల్‌ ఎం.పంచోలితో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. రెవెన్యూ లోటు అధికంగా ఉన్నప్పటికీ రాష్ట్రాలు పెద్దఎత్తున ఉచితాలు ఎలా ప్రకటిస్తున్నాయంటూ బెంచ్‌ విస్మయం వ్యక్తం చేసింది. దీనివల్ల దేశ ఆర్థికాభివృద్ధి దెబ్బ తింటుందని హెచ్చరించింది. రెవెన్యూ లోటు లేని రాష్ట్రాలు సైతం అదనంగా ఉన్న నిధులను రహదారుల అభివృద్ధికి, ఆస్పత్రులకు, స్కూళ్లకు ఉపయోగించవచ్చునని సూచించింది. అందరికీ ఉచితంగా ఆహారం, సైకిళ్లు, విద్యుత్‌ ఇవ్వడానికి బదులుగా.... ఉపాధి కోసం మార్గాలు తెరిచేందుకు అన్ని రాష్ట్రాలూ కృషి చేయాలని హితవు పలికింది. ‘‘దేశంలో మనం ఎలాంటి సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నాం? సంక్షేమ చర్యల్లో భాగంగా విద్యుత్‌ చార్జీలు చెల్లించలేని వారికి ఉచితంగా అందిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ చార్జీలు భరించగల వారికీ ఉచితంగా ఇస్తామనడం సబబేనా?పెద్ద పెద్ద భూస్వాములకు కూడా ఉచిత విద్యుత్‌ ఇస్తారా?’’ అని తమిళనాడు ప్రభుత్వాన్ని నిలదీసింది. ఉచితాలకు పెట్టే ఖర్చును విద్యా రంగానికి మళ్లించవచ్చునని, ఆ నిధులతో నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చు కదా అని సూచించింది. ‘‘ఉచిత ఆహారం, ఉచిత విద్యుత్‌.. ఇలా అన్నీ ఉచితంగా ఇస్తే ఆపై ఎవరు పని చేస్తారు? పని సంస్కృతికి చెల్లుచీటి ఇవ్వాలనుకుంటున్నారా?’’ అని బెంచ్‌ నిలదీసింది.


దేశాభివృద్ధికి హానికరం

ప్రభుత్వ రాయితీలను అర్హులు మాత్రమే కాకుండా ఇతరులు కూడా పొందడం దేశాభివృద్ధికి హానికరమని బెంచ్‌ అభిప్రాయపడింది. అప్పుల భారంలో చిక్కుకున్న స్థితిలో ఉచితాలను ఏ విధంగా పంపిణీ చేస్తారనేది చెప్పాలని తమిళనాడు ప్రభుత్వాన్ని వివరణ కోరింది. తమిళనాడులో ఉన్నట్లుండి ఉచిత విద్యుత్‌ పథకాన్ని ప్రకటించడం వెనుక ఆంతర్యమేమిటని అడిగింది. దీని వల్ల విద్యుత్‌ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) నిధుల కొరతతో బడ్జెట్‌ లెక్కలకు తగ్గట్లు టారిఫ్‌ లను సవరించేందుకు ప్రయత్నించాల్సి వస్తోందని పేర్కొంది. విద్యుత్‌ టారి్‌ఫను నోటిఫై చేసిన తర్వాత ఇంత బృహత్తర నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని తమిళనాడు విద్యుత్‌ బోర్డ్‌ను ప్రశ్నించింది. ఇది బుజ్జగింపు రాజకీయం కాదా? అని నిలదీసింది. ప్రజాస్వామ్యంలో ఒక పథకాన్ని ప్రకటించే ముందు, దానికోసం నిధులు ఎలా సమకూర్చుతారనేది బడ్జెట్‌లో స్పష్టంగా చెప్పాల్సి ఉంటుందని పేర్కొంది. ఉచితాల వ్యయ భారం చివరకు పన్నులు చెల్లిస్తున్నవారిపై పడుతుందని, ఈ పరిస్థితి మారాల్సి ఉందని కటువుగా వ్యాఖ్యానించింది. తమిళనాడు ప్రభుత్వం అనే కాకుండా.. అన్ని ప్రభుత్వాలూ, రాజకీయ పార్టీలూ భారీగా ఉచితాలను ప్రకటించే ముందు పునఃసమీక్షించుకోవాలని సూచించింది. ఈ వ్యవహారంపై అభిప్రాయం తెలపాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తమిళనాడు తరఫున సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ సుబ్రమణ్యం వాదనలు వినిపించారు.

‘‘ఎన్నికలు జరిగేందుకు కొద్ది రోజుల ముందు ఉచితాలను ప్రకటించడం ఎంతకాలం కొనసాగుతుంది? ఈ ధోరణి ఇలాగే కొనసాగితే దేశ దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధి కుంటుపడిపోదా? ఈ దేశంలో అసలు ఏం జరుగుతోంది? ఉచితాలు ఎవరికి అవసరమో, ఎవరికి అవసరం లేదో కూడా చూడకుండా, విచక్షణా రహితంగా ప్రభుత్వ నిధులను పంచిపెట్టడం పూర్తిగా బుజ్జగింపు కిందకే వస్తుంది. అది దేశ ఆర్థికాభివృద్ధికి మంచిది కాదు.’’

- సుప్రీంకోర్టు

Updated Date - Feb 20 , 2026 | 02:36 AM