విధి నిర్వహణలో ఉన్న ఈడీ అధికారులు భారత పౌరసత్వాన్ని కోల్పోతారా?
ABN , Publish Date - Mar 25 , 2026 | 03:29 AM
కేంద్రంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉండగా, రాష్ట్ర స్థాయిలో మరేదైనా రాజకీయ పార్టీ అదే పని చేస్తే ఏమవుతుంది?’’ అని సుప్రీంకోర్టు బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
బెంగాల్ సర్కారును ప్రశ్నించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, మార్చి 24: ‘‘కేంద్రంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉండగా, రాష్ట్ర స్థాయిలో మరేదైనా రాజకీయ పార్టీ అదే పని చేస్తే ఏమవుతుంది?’’ అని సుప్రీంకోర్టు బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాజకీయ సలహా సంస్థ ఐ-ప్యాక్‌పై నిర్వహించిన సోదాలకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అధికారులు ఆటంకం కల్పించారంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం ఈ ప్రశ్న వేసింది. ఐ-ప్యాక్‌పై జరిపిన దాడుల్లో సీఎం మమత జోక్యం చేసుకున్నారని ఆరోపిస్తూ ఆర్టికల్ 32 కింద ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత ఉందా? లేదా? అన్న విషయమై తలెత్తిన అభ్యంతరాలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈడీకి చెందిన కొందరు అధికారులు వ్యక్తిగత హోదాలో పిటిషన్ దాఖలు చేశారని ధర్మాసనం పేర్కొంది. పోలీసులను ఆశ్రయించే అవకాశం ఉన్నప్పుడు, ఆర్టికల్ 32 కింద ఈడీ పిటిషన్ దాఖలు చేయరాదని మమత సర్కారు తరఫున కపిల్ సిబల్ వాదించారు. స్పందించిన ధర్మాసనం.. ‘‘విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఈడీ అధికారులు భారత పౌరసత్వాన్ని, హక్కులను కోల్పోతారా?’’ అని నిలదీసింది. ఇక, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేసు విచారణను వాయిదా వేయాలన్న అభ్యర్థనను కూడా కోర్టు తిరస్కరించింది. ‘మేం ఎన్నికల్లో భాగస్వాములం కాదలచుకోలేదు. కోర్టు సమయం మాకు తెలుసు. తీర్పు వెలువడే సమయం కూడా తెలుసు’ అని జస్టిస్ మిశ్రా అన్నారు.