Share News

నిర్బంధం వద్దు

ABN , Publish Date - Oct 12 , 2026 | 04:28 AM

ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పౌరులు, ప్రతిపక్ష నాయకులతోపాటు న్యాయవాదులపైనా పోలీసులు అణచివేత ధోరణి ప్రదర్శించడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

నిర్బంధం వద్దు

  • నిర్బంధం వద్దు.. చట్టవిరుద్ధ అరెస్టులూ వద్దు

  • ట్రాఫిక్‌, మెట్రోపై ఇష్టారాజ్యంగా ఆంక్షలు చెల్లవు.. అత్యవసరమైతేనే బారికేడ్లు

  • ఇంటర్నెట్‌కు అంతరాయం కలిగించవద్దు.. పౌరుల ప్రాథమిక హక్కులను

  • కాపాడటం మా బాధ్యత.. లాయర్లు, జర్నలిస్టులకు అడ్డంకులు కలిగించొద్దు

  • మెట్రోస్టేషన్ల మూసివేత కోర్టు ధిక్కరణే.. దీనిపై అఫిడవిట్‌ వేయండి: సుప్రీం

  • నిరసనకారుల పట్ల పోలీసులు విచక్షణా రహితంగా వ్యవహరించారు

  • ధర్మాసనానికి విన్నవించిన పలువురు న్యాయవాదులు

  • 45 స్టేషన్లే మూసివేశాం.. ఇంటర్నెట్‌ను పునరుద్ధరించాం: సొలిసిటర్‌ జనరల్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పౌరులు, ప్రతిపక్ష నాయకులతోపాటు న్యాయవాదులపైనా పోలీసులు అణచివేత ధోరణి ప్రదర్శించడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిరసనకారులను చట్టవిరుద్ధంగా నిర్బంధించడం గానీ, ప్రజా రవాణాను ఇష్టారాజ్యంగా నిలిపివేయడం గానీ చేయకూడదని తేల్చిచెప్పింది. 10వ తేదీన ఢిల్లీలో జరిగిన దాన్ని చిన్నవిషయంగా చూడటం లేదని పేర్కొంది. ట్రాఫిక్‌, మెట్రోపై ఇష్టారాజ్యంగా ఆంక్షలు చెల్లవని, పౌరుల స్వేచ్ఛా రాకపోకలను అనుమతించాలని ఆదేశించింది. అవసరమైన చోటే బారికేడ్లు పెట్టి, మిగతా వాటిని తొలగించాలని స్పష్టం చేసింది. ఇంటర్నెట్‌కు అంతరాయం కలిగించవద్దని ఆదేశించింది. మెట్రోస్టేషన్లను మూసివేయవద్దని తాము ఆదేశించినా, ఎందుకు మూసివేశారని ప్రశ్నించింది. ఇది కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కిందకు ఎందుకు రాదో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఢిల్లీలో మెట్రో, రైల్వే సర్వీసుల రద్దు, నిరసనకారుల అణచివేతపై పదుల సంఖ్యలో దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ బాగ్చి, జస్టిస్‌ మోహనలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదివారం ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. ‘‘మెట్రోలో ఒక మార్గంలో ప్రారంభ, చివరిస్టేషన్లను మాత్రమే తెరిచి.. మధ్యలో మూసివేస్తే రాకపోకలు ఎలా? ఏయే స్టేషన్లు తెరిచి ఉన్నాయి, ఏవి మూసేశారనే వివరాలను స్పష్టంగా మ్యాప్‌ ద్వారా నివేదికలో ఇవ్వండి’’ అని అధికారులను ధర్మాసనం ఆదేశించింది.


పోలీసు రాజ్యంలా మారిపోయింది..

పోలీసులు నిరసనకారులపై విచక్షణారహితంగా బలాన్ని ఉపయోగించారని, నేమ్‌బ్యాడ్జీలు కూడా పెట్టుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మహిళా నిరసనకారులతో పురుష పోలీసులు మర్యాద లేకుండా ప్రవర్తించారని ఆరోపించారు. తనవద్ద పనిచేసే ఒక మహిళా జూనియర్‌ న్యాయవాదిని పోలీసులు వ్యాన్‌లో తీసుకెళ్లి 11 కిలోమీటర్ల దూరంలో నిర్మానుష్య ప్రాంతంలో వదిలేశారని మాజీ అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ ధర్మాసనానికి వివరించారు. పేశనివారం నాటి వాతావరణం చూస్తే దేశంలో పోలీసు రాజ్యం ఏర్పడటానికి ఒక్క అడుగు దూరంలోనే ఉన్నామనే భావన కలిగిందని సీనియర్‌ న్యాయవాది షాదన్‌ ఫరసాత్‌ వ్యాఖ్యానించారు.

15శాతం మెట్రోస్టేషన్లు మాత్రమే మూసివేశాం: సొలిసిటర్‌ జనరల్‌

నిర్బంధించిన వారిలో మెజారిటీ పౌరులను మధ్యాహ్నం 2గంటలకు అదుపులోకి తీసుకుని సాయంత్రం 6 గంటలకే విడుదల చేశామని కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు వివరణ ఇచ్చారు. అక్టోబరు 10న షెడ్యూల్‌ చేసిన 4,157 మెట్రోరైలు ట్రిప్పులను పూర్తిస్థాయిలో నడిపామని చెప్పారు. మొత్తం 303 స్టేషన్లలో కేవలం 15శాతం(45 స్టేషన్లు) మాత్రమే భద్రతా కారణాలతో మూసివేశామన్నారు. ప్రస్తుతం అన్ని మెట్రోస్టేషన్లు తెరిచి ఉన్నాయని, ఇంటర్నెట్‌ సేవలు పునరుద్ధరించామని ధర్మాసనానికి వివరించారు.

Updated Date - Oct 12 , 2026 | 04:30 AM