అన్ని ఔషధాలపై 16శాతం మార్జిన్ పరిమితి?
ABN , Publish Date - Sep 30 , 2026 | 04:09 AM
ఆసుపత్రులు క్యాన్సర్ ఔషధాలను పది రెట్లు అధిక ధరకు విక్రయిస్తుండడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
ధరల్లో ఎందుకీ వ్యత్యాసం?
ఆస్పత్రిలోనే ఎందుకు కొనాలి?
కేంద్రానికి సుప్రీం ప్రశ్నలు
అన్ని ఔషధాలపై 16 శాతం
మార్జిన్ పరిమితి?
ఎందుకు విధించొద్దు..ధరల్లో తేడా ఎందుకు?
క్యాన్సర్ మందులను 10 రెట్ల అధిక ధరకు
విక్రయించడంపై కేంద్రానికి సుప్రీం ప్రశ్న
న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: ఆసుపత్రులు క్యాన్సర్ ఔషధాలను పది రెట్లు అధిక ధరకు విక్రయిస్తుండడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది కేవలం దోపిడీ కాదని, సామాన్య ప్రజల ప్రాణాలతో ఆడుతున్న చెలగాటమని అభివర్ణించింది. అసలు ‘ఔషధ ధరల నియంత్రణ చట్టం, 2013’ పరిధిలో ఎసెన్షియల్ (అత్యావశ్యకం), నాన్ ఎసెన్షియల్ (అత్యావశ్యకం కానివి) అంటూ మందుల ధరల విషయంలో ఎందుకు ఈ వ్యత్యాసమని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ సందర్భంగా కేంద్రాన్ని ప్రశ్నించింది. అన్ని ఔషధాల ఎంఆర్‌పీపై 16ు మార్జిన్ (కొనుగోలు-విక్రయం మధ్య వ్యత్యాసం) పరిమితి ఎందుకు విధించరాదు? అని ప్రశ్నించింది. ‘‘కార్పొరేట్ ఆసుపత్రుల్లో క్యాన్సర్ ఔషధం విక్రయ ధర రూ.27,000 ఉండగా, దీన్ని రిటైలర్‌కు (ఫార్మసీ స్టోర్) రూ.2,700కే సరఫరా చేస్తున్నారు. ఈ లాభం అంతా ఎక్కడికి వెళుతోంది? ఎవరు ప్రయోజనం పొందుతున్నారు? ఆసుపత్రులు తమ అనుబంధ ఫార్మసీల నుంచే ఔషధాలు కొనుగోలు చేయాలని నిర్దేశిస్తున్నాయి. పేషెంట్ బయట వేరే ఏదైనా స్టోర్ నుంచి తెస్తే చికిత్సకు హామీ ఇవ్వడం లేదు.
దీంతో సామాన్యులు నలిగిపోతున్నారు. ఎవరైనా ఫార్మాసిస్ట్ మానవతా దృక్పథంలో అదే ఔషధాన్ని రూ.2,700 విక్రయిస్తే.. అది నిజమైనదా? నకిలీదా? అని సందేహించేలా ఈ వ్యవస్థ మారిపోయింది. కార్పొరేట్ ఆసుపత్రులు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. ఎక్కడా సేవాభావం కనిపించడం లేదు. దీనిపై కేంద్రం దృష్టి సారించాలి’’అని జస్టిస్ మెహతా అన్నారు. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. అధికారులతో ఈ అంశంపై చర్చించాల్సి ఉందని, రెండు వారాల సమయం ఇవ్వాలని కోరారు. దీంతో కోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 12కు వాయిదా వేసింది.