Share News

‘ఓటుకు నోటు’ కేసు విచారణ మే 20కి వాయిదా

ABN , Publish Date - Apr 23 , 2026 | 04:30 AM

ఓటుకు నోటు’ కేసులో విచారణను సుప్రీంకోర్టు మే 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల నియామావళి చట్టాల కింద విచారించాలని కోరుతూ...

‘ఓటుకు నోటు’ కేసు విచారణ మే 20కి వాయిదా

  • మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): ‘ఓటుకు నోటు’ కేసులో విచారణను సుప్రీంకోర్టు మే 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల నియామావళి చట్టాల కింద విచారించాలని కోరుతూ 2021, జూలై 22 ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ అదే ఏడాది ఏప్రిల్‌ 13న సండ్ర వెంకట వీరయ్య వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ రెండు పిటిషన్లను కలిపి జస్టిస్‌ జే.కే.మహేశ్వరి, జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్‌ల ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ్‌ లూత్రా, ప్రతివాదుల తరఫున ఆర్యమ సుందరం విచారణకు హాజరయ్యారు. తొలుత ఆర్యమ సుందరం వాదనలు వినిపిస్తూ.. అవినీతి నిరోధక చట్టం - 1988లోని సెక్షన్‌ 12 సహా పలు సెక్షన్ల కింద దాఖలైన ‘మహేంద్ర కుమార్‌ రాంచంద్ర జన్‌రావు వర్సెస్‌ ేస్టట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర’ కేసులో జస్టిస్‌ మనోజ్‌ మిశ్రానేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసిందని తెలిపారు. ఆ కేసుతో ఓటుకు నోటు కేసుకు పోలిక ఉందని చెప్పారు. ఆ తీర్పు వచ్చే వరకు వేచి చూద్దామని గతంలో ధర్మాసనం స్పష్టం చేసిందని గుర్తు చేశారు. మరో రెండువారాల్లో ఆ తీర్పు వచ్చే అవకాశం ఉన్నందున ఈ పిటిషన్ల విచారణను వాయిదా వేయాలని కోరారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం కేసు విచారణను మే 20వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. ఓటుకు నోటు కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత జగదీశ్‌ రెడ్డి ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన తరఫున న్యాయవాది వికాస్‌ సింగ్‌ హాజరయ్యారు. ఇంప్లీడ్‌ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకొని పిటిషనర్లకు నోటీసు ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా, సిద్దార్థ్‌ లూథ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మే 20వ తేదీనే ఇంప్లీడ్‌ పిటిషన్‌ పైనా నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది.

Updated Date - Apr 23 , 2026 | 04:31 AM