సెక్స్ ట్రాఫికింగ్ బాధితులు బాలలైతే..నిందితులపై పోక్సో కేసు
ABN , Publish Date - Jun 01 , 2026 | 04:07 AM
కమర్షియల్ సెక్స్ ట్రాఫికింగ్ కేసుల్లో బాధితులు బాలలైతే.. నిందితులపై భారతీయ న్యాయసంహితలోని 143, 144 సెక్షన్లు, అనైతిక మానవ అక్రమ రవాణా...
పెట్టాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ, మే 31: కమర్షియల్ సెక్స్ ట్రాఫికింగ్ కేసుల్లో బాధితులు బాలలైతే.. నిందితులపై భారతీయ న్యాయసంహితలోని 143, 144 సెక్షన్లు, అనైతిక మానవ అక్రమ రవాణా (నిరోధక) చట్టం (ఐటీపీఏ)లోని సెక్షన్లతోపాటు అత్యంత కఠినమైన పోక్సో చట్టం కింద కూడా అభియోగాలు నమోదు చేసి, విచారణ జరపాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహిళలు, బాలికల అక్రమ రవాణా, బలవంతపు వేశ్యావృత్తి అంశంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై భిన్నమైన కోణాల్లో సుదీర్ఘంగా విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల ఇచ్చిన తీర్పులో ఈ అంశాన్ని విస్పష్టంగా పేర్కొంది. ‘‘మానవ అక్రమ రవాణాకు గురైన బాలల సమ్మతికి ఎలాంటి ప్రాధాన్యమూ లేదు. వారిని ఎలా ఒప్పించారనేదాంతో కూడా (బెదిరించడం/డబ్బు ఆశ చూపడం వంటివాటితో) సంబంధం లేదు. దర్యాప్తు అధికారుల దృష్టి అంతా.. నేరగాళ్ల చర్యలపైన, వారి ఉద్దేశాలపైనే ఉండాలి. బలవంతం చేయడం, మోసగించడం లాంటి విధానాలతో సహా.. ఏ విధంగానైనా సరే వారు మానవ అక్రమ రవాణాకు పాల్పడినట్టు రుజువైతే.. ‘బాధితుల అంగీకారం’ అనే వాదనను అప్రస్తుతంగా పరిగణించాలి’’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. చిన్నారులను లైంగికంగా దోపిడీకి గురి చేసే ఏ చర్య అయినా చట్టపరంగా సమ్మతి లేనిదేనని, దీనిపై మన దేశ చట్టాల్లో ఎలాంటి సందిగ్ధమూ లేదని పేర్కొంది.