ఐసీయూల్లో సేవలపై మార్గదర్శకాల అమలుకు కార్యాచరణ సిద్ధం చేయండి: సుప్రీంకోర్టు
ABN , Publish Date - Apr 26 , 2026 | 04:00 AM
ఆస్పత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) లేదా క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ) సేవలకు సంబంధించిన మార్గదర్శకాల అమలుకు....
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఆస్పత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) లేదా క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ) సేవలకు సంబంధించిన మార్గదర్శకాల అమలుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా(యూటీ)లను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ ప్రణాళిక వాస్తవికంగా, ఆచరణాత్మకంగా ఉండాలని స్పష్టం చేసింది. ‘ఇంటెన్సివ్ కేర్ సేవల నిర్వహణ-డెలివరీ మార్గదర్శకాలు’ సిద్ధంగా ఉన్నాయని..వీటిపై సర్వత్రా ఏకాభిప్రాయం ఉందని.. ఐసీయూకి కనీస ప్రామాణికంగా దీనిని అమలు చేయవచ్చని పిటిషనర్ నివేదించగా.. దర్మాసనం పై ఆదేశాలిచ్చింది. సదరు మార్గదర్శకాల ప్రతులను అన్ని రాష్ట్రాలు, యూటీలకు అందజేయాలని స్పష్టంచేసింది. తక్షణ చర్యగా అన్ని రాష్ట్రాలు/యూటీల ఆరోగ్య శాఖల అదనపు సీఎ్‌సలు లేదా కార్యదర్శులు నిపుణులతో సమావేశం కావాలని.. ఆయా మార్గదర్శకాల అమలుకు కార్యాచరణ రూపొందించాలని ఈ నెల 20న జారీచేసిన ఉత్తర్వుల్లో తెలిపింది. ‘ఈ ప్రక్రియ తక్షణమే ప్రారంభం కావాలి. మేం ఉత్తర్వులిచ్చిన రోజు నుంచి వారంలోగా సమావేశం నిర్వహించాలి. సంబంధిత అదనపు సీఎ్‌సలు/కార్యదర్శులు వ్యక్తిగతంగా తప్పనిసరిగా హాజరు కావాలి. చర్చల అనంతరం సిద్ధంచేసిన నివేదికను కేంద్ర ఆరోగ్య కార్యదర్శికి పంపాలి. తదుపరి విచారణ జరిగే మే 18నాటికి తుది నివేదిక లేదా బ్లూప్రింట్‌ను కోర్టుకు సమర్పించాలి’ అని ఆదేశించింది.