ప్యాకేజ్డ్ ఫుడ్‌పై హెచ్చరిక లేబుళ్లు ఉండాల్సిందే
ABN , Publish Date - Nov 27 , 2026 | 03:57 AM
అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు పదార్థాలు కలిగిన ఆహార ప్యాకెట్ల ముందుభాగంలో స్పష్టంగా కనిపించేలా ప్రత్యేక హెచ్చరిక లేబుళ్లను తప్పనిసరిగా ముద్రించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
హై షుగర్, సాల్ట్, ఫ్యాట్ అని ముద్రించాలి: సుప్రీం
ప్రతి పోషకానికి వేర్వేరుగా ఎరుపు రంగు షట్కోణం
ఎఫ్‌ఎస్ఎస్ఏఐకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
విధివిధానాల ఖరారులో జాప్యంపై అసహనం
న్యూఢిల్లీ, నవంబరు 26: అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు పదార్థాలు కలిగిన ఆహార ప్యాకెట్ల ముందుభాగంలో స్పష్టంగా కనిపించేలా ప్రత్యేక హెచ్చరిక లేబుళ్లను తప్పనిసరిగా ముద్రించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనారోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను వినియోగదారులు సులభంగా గుర్తించేందుకు వీలుగా నిబంధనలను కఠినతరం చేసింది. అన్నింటికీ ఒకే హెచ్చరికకు బదులుగా ఒక్కో పోషకానికి(అధిక చక్కెర, అధిక ఉప్పు, అధిక కొవ్వు) వేర్వేరుగా ఎరుపు రంగులో షట్కోణాకార హెచ్చరిక గుర్తులు ఏర్పాటు చేయాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్ఎస్ఏఐ)ను జస్టిస్ జె.బి. పార్దీవాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశించింది. నిర్దేశిత పరిమితులను మించి ఉన్న ఉత్పత్తులపై హై షుగర్, హై సాల్ట్, హై ఫ్యాట్ అనే హెచ్చరికలను స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని స్పష్టం చేసింది. ఒక్కో హెచ్చరిక గుర్తు ప్యాకెట్ ముందుభాగంలోని ప్రధాన ప్రదర్శన ప్రాంతంలో 4 నుంచి 5 శాతం స్థలంలో ఉండాలని సూచించింది.
గతంలో రెండు అంతకంటే ఎక్కువ పోషకాలు ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయని గుర్తించేందుకు వీలుగా హెచ్చరిక లేబుళ్ల ఉండాలని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ తీసుకొచ్చిన ప్రతిపాదలను మరింత కఠినతరం చేసింది. 2022 నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ విధివిధానాల ఖరారులో జాప్యం ఎందుకు జరుగుతోందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నిబంధనలను స్వచ్ఛందంగా పాటించేందుకు కంపెనీలకు 365 రోజుల గడువు ఇవ్వాలని నియంత్రణ సంస్థ ప్రతిపాదించడంపై కోర్టు అసహనం వ్యక్తంచేసింది. నిబంధనల అమలుకు నాలుగు నెలల గడువు విధించింది. ఈ గడువును పొడిగించబోమని, నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.