Share News

రిజర్వు చేసిన 3 నెలల్లో తీర్పు వెలువరించాలి

ABN , Publish Date - May 30 , 2026 | 03:23 AM

హైకోర్టుల్లో విచారణ ముగిసినా తీర్పుల వెల్లడిలో జరుగుతున్న అసాధారణ జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగంలోని...

రిజర్వు చేసిన 3 నెలల్లో తీర్పు వెలువరించాలి

  • హైకోర్టులకు సుప్రీం కీలక మార్గదర్శకాలు..

న్యూఢిల్లీ, మే 29: హైకోర్టుల్లో విచారణ ముగిసినా తీర్పుల వెల్లడిలో జరుగుతున్న అసాధారణ జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 కింద తనకున్న విశేష అధికారాలను ఉపయోగించి.. న్యాయవ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేలా పలు అంశాలపై అన్ని హైకోర్టులకు శుక్రవారం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. హైకోర్టుల్లో తీర్పు రిజర్వు చేసిన తర్వాత దాన్ని వెలువరించేందుకు గరిష్ఠంగా 3 నెలల సమయం మాత్రమే తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్‌ విపిన్‌ ఎం పంచోలీల ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ తీర్పు వెలువరించకపోతే దాన్ని రిజిస్ట్రార్‌ జనరల్‌ సంబంధిత హైకోర్టు సీజే ముందుకు తీసుకెళ్లాలని.. తీర్పు వెల్లడించేందుకు సీజే మరో రెండు వారాల సమయమివ్వొచ్చని పేర్కొంది. అయినప్పటికీ తీర్పు రాకపోతే కేసును సీజే మరో బెంచ్‌కు బదిలీ చేయాలని తెలిపింది. ఇక వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి బెయిల్‌ పిటిషన్ల విషయంలో హైకోర్టులు అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. బెయిల్‌ దరఖాస్తులపై విచారణ రోజే తీర్పును ప్రకటించాలని.. లేదా (గరిష్ఠంగా 24 గంటల) మరుసటి రోజు లోపు తీర్పును వెలువరించి ఆర్డర్‌ కాపీని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని తెలిపింది. ‘బెయిల్‌ లేదా శిక్ష నిలుపుదల ఉత్తర్వులు వెలువడిన వెంటనే జైలు అధికారులకు తెలియజేయాలి. విచారణలో ఉన్న ఖైదీని అదే రోజు లేదా గరిష్ఠంగా మరుసటి రోజు కల్లా విడుదల చేయాలి’ అని పేర్కొంది. ఇక అత్యవసర కేసు (కూల్చివేతలు, బహిష్కరణలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలు, బెయిల్‌ తదితరా)ల్లో కేవలం ప్రధాన నిర్ణయం (ఆపరేటివ్‌ ఆర్డర్‌) ముందుగా ఓపెన్‌ కోర్టులో ప్రకటించినా దానికి గల పూర్తి కారణాల జడ్జిమెంట్‌ను సాధారణంగా 7 రోజుల్లోపు.. అసాధారణ పరిస్థితుల్లో 15 రోజుల్లోపు వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేయాలని స్పష్టం చేసింది.

Updated Date - May 30 , 2026 | 03:23 AM