Supreme Court Orders: ఆ 1.25 కోట్ల ఓటర్ల పేర్లనుపంచాయతీల్లో ప్రదర్శించండి
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:41 AM
పశ్చిమ బెంగాల్‌లో సమగ్ర ఓటర్ల సవరణ (ఎస్‌ఐఆర్)లో భాగంగా ఓటర్ల తల్లిదండ్రుల పేర్లు, వయసుల్లో తేడాల వల్ల నోటీసులు అందుకున్నవారి వివరాలను ప్రతి గ్రామపంచాయతీ, బ్లాక్ కార్యాలయాల్లో ప్రదర్శించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి....
పశ్చిమ బెంగాల్‌లో ఓటర్లకు నోటీసులపై ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం
ఓటర్ల అభ్యంతరాలూ స్వీకరించాలని సూచన
న్యూఢిల్లీ, జనవరి 19: పశ్చిమ బెంగాల్‌లో సమగ్ర ఓటర్ల సవరణ (ఎస్‌ఐఆర్)లో భాగంగా ఓటర్ల తల్లిదండ్రుల పేర్లు, వయసుల్లో తేడాల వల్ల నోటీసులు అందుకున్నవారి వివరాలను ప్రతి గ్రామపంచాయతీ, బ్లాక్ కార్యాలయాల్లో ప్రదర్శించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఎస్‌ఐఆర్‌లో భాగంగా ప్రాథమిక వివరాల్లో తేడాలు ఉన్న 1.25 కోట్ల ఓటర్లను ఈసీ ‘లాజికల్ డిస్ర్కిపెన్సీ’ (తార్కిక తేడాలు) జాబితాలో చేర్చింది. వీరి ఓట్లను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసులు జారీచేసింది. దీనిని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మిశ్రా, జస్టి్‌సలు దీపాంకర్ దత్తా, జాయ్‌మాల్య బాగ్చిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ జాబితాలో చేర్చిన ఓటర్ల పేర్లను వారి గ్రామపంచాయతీలోనే ప్రదర్శించాలని ఆదేశించింది. ఆయా ఓటర్లు తమకు సంబంఽఽధించిన సరైన గుర్తింపు పత్రాలను సమర్పించేందుకు అవకాశం ఇవ్వాలని, ఆ పత్రాలను ప్రతి గ్రామపంచాయతీ, బ్లాక్ ఆఫీసుల్లో స్వీకరించాలని సూచించింది. ఇందుకోసం అవసరమైన మానవ వనరులను సమకూర్చాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఏర్పాట్లు చేయాలని ఆ రాష్ట్ర డీజీపీకి సూచించింది.