Share News

న్యాయవ్యవస్థపై తుపాకీ పేల్చారు!

ABN , Publish Date - Feb 27 , 2026 | 04:16 AM

న్యాయవ్యవస్థలో అవినీతి’ పాఠ్యాంశాన్ని 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో చేర్చిన జాతీయ విద్యాపరిశోధన-శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ)పై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది....

న్యాయవ్యవస్థపై తుపాకీ పేల్చారు!

  • నెత్తురోడుతోంది.. సీజేఐ సూర్యకాంత్‌ తీవ్ర ఆవేదన

  • ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంపై సంపూర్ణ నిషేధం

  • భౌతిక, డిజిటల్‌ ప్రతులన్నీ సీజ్‌ చేయాలి

  • దీని వెనుక లోతైన కుట్ర కనిపిస్తోంది

  • బాధ్యులపై వేటు పడక తప్పదు: సీజేఐ

  • ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌కు షోకాజ్‌ నోటీసులు

  • కేంద్ర పాఠశాల విద్య కార్యదర్శికి కూడా..

  • తదుపరి విచారణ మార్చి 11కి వాయిదా

  • ఎన్‌సీఈఆర్‌టీ తీరుపై మోదీ అసంతృప్తి

  • బాధ్యులను శిక్షించాల్సిందేనని స్పష్టీకరణ?

  • దీనిపై బాధ పడుతున్నాం.. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: ధర్మేంద్ర ప్రధాన్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ పాఠ్యాంశాన్ని 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో చేర్చిన జాతీయ విద్యాపరిశోధన-శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ)పై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. న్యాయవ్యవస్థపై తుపాకీ పేల్చారని.. అది రక్తమోడుతోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఎక్స్‌ప్లోరింగ్‌ సొసైటీ: ఇండియా అండ్‌ బియాండ్‌ (పార్ట్‌2)’ పేరుతో ఉన్న సదరు పాఠ్యపుస్తకాన్ని సంపూర్ణంగా, సమగ్రంగా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. దాని భౌతిక, డిజిటల్‌ ప్రతులను సీజ్‌ చేయాలని ఆదేశించారు. పుస్తకాన్ని మళ్లీ ప్రచురించడం గానీ, ముద్రించడం గానీ చేయరాదని.. డిజిటల్‌గానూ పంపిణీ చేయరాదని స్పష్టంచేశారు. ఇంత వివాదాస్పద అంశాన్ని పాఠ్యపుస్తకంలో చేర్చిన వారిపై ఎందుకు కోర్టు ధిక్కార చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌కు, కేంద్ర పాఠశాల విద్య కార్యదర్శికి షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ మను సింఘ్వీ బుధవారం.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ విపుల్‌ ఎం.పంచోలితో కూడిన ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ప్రస్తావించగా.. దీనిని సుమోటోగా తీసుకుని ఇప్పటికే ఆదేశాలిచ్చానని చీఫ్‌ జస్టిస్‌ చెప్పడం తెలిసిందే. గురువారం త్రిసభ్య ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ అధ్యాయంలో అవమానకర అంశాలున్నాయని.. దీని వెనుక చాలా లోతైన కుట్ర కనిపిస్తోందని జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు. వ్యవస్థ గౌరవ ప్రతిష్ఠలను దెబ్బతీసే ఉద్దేశపూర్వక చర్యగా భావిస్తున్నామని చెప్పారు. ‘బాధ్యులపై వేటు పడక తప్పదు. లోతైన దర్యాప్తు జరపాలనుకుంటున్నాం’ అని తెలిపారు.


డైరెక్టర్‌ నిర్లక్ష్య స్పందన..!

‘న్యాయవ్యవస్థలో అవినీతి’పై 8వ తరగతి పాఠ్యపుస్తకంలో ఓ అధ్యాయం ఉందని ఓ దినపత్రికలో వచ్చిన వ్యాసం చూసి షాకయ్యామని ధర్మాసనం పేర్కొంది. దీనిని ప్రచురించింది ఎన్‌సీఈఆర్‌టీయేనా అనేది వాకబు చేయాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ను ఆదేశించామని తెలిపింది. పూర్తి నిర్లక్ష్యంగా, బాధ్యత లేకుండా.. ధిక్కారపూర్వకంగా..దురుద్దేశపూరితంగా పుస్తకంలో రాసి.. ఆత్మపరిశీలన చేసుకోకపోగా.. ఆయా అంశాలను సమర్థిస్తూ ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ నిర్లక్ష్యంగా వివరణ ఇచ్చారని ఆక్షేపించింది. ‘పుస్తకంలోని విషయాన్ని ప్రాథమికంగా పరిశీలించాక.. డైరెక్టర్‌ స్పందన చూశాక.. న్యాయవ్యవస్థ అధికారాన్ని, దాని గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశపూర్వక చర్యగా పరిగణించాం. దీనిని ఇలాగే వదిలేస్తే న్యాయవ్యవస్థ పవిత్రతను దెబ్బతీస్తుంది. దానిపై ప్రజల్లో ఉన్న భారీ అంచనాలను.. మరీ ప్రధానంగా యువత మనసులపై ప్రభావం చూపుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు న్యాయవ్యవస్థ చేసిన కృషి.. సత్వర న్యాయాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి సుప్రీంకోర్టు తీసుకున్న చర్యలు.. చేపట్టిన పరివర్తనా కార్యక్రమాలపై ఆ పుస్తకంలో ప్రస్తావనే లేదు. అవినీతి, మోసపూరిత కార్యకలాపాలు, ప్రజాధనం మళ్లింపు వంటి అంశాల్లో ఎందరో ఉన్నత స్థాయి అధికారులను ఇదే కోర్టు తీవ్రంగా అభిశంసించింది. దీనిపై పుస్తకంలో మౌనం వహించడం చాలా ఘోరం’ అని వ్యాఖ్యానించింది. ఆ పుస్తకంలోని అంశాల వల్ల న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తి, స్వాతంత్య్రంపై శాశ్వతంగా చూపే తీవ్ర ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది. ఈ పుస్తక ప్రచురణ దుష్ప్రవర్తనతో పాటు కోర్టు ధిక్కారాల చట్టం(1971)లోని సెక్షన్‌ 2సీ కింద క్రిమినల్‌ ధిక్కారం కిందకు వస్తుందని స్పష్టం చేసింది. పుస్తకాన్ని పునఃప్రచురణ, పునర్ముద్రణ చేయరాదని, డిజిటల్‌గానూ వ్యాప్తిచేయరాదని తేల్చిచెప్పింది. తమ ఉత్తర్వుల అమలుపై రెండు వారాల్లో జవాబివ్వాలని అన్ని రాష్ట్రాల విద్యాశాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. వారి నివేదికలను, ఇతర వివరాలను పరిశీలించాక.. బాధ్యులను నిర్ధారించడానికి ఓ ప్యానెల్‌ను ఏర్పాటుచేసే అవకాశం ఉందని సీజేఐ తెలిపారు. ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలంటూ వందలకొద్దీ ఫోన్‌కాల్స్‌ తనకు వచ్చాయన్నారు. తదుపరి విచారణను మార్చి 11వ తేదీకి వాయిదావేశారు.


మీడియాకు సీజేఐ ధన్యవాదాలు

ఈ అంశాన్ని హైలైట్‌ చేసినందుకు చీఫ్‌ జస్టిస్‌ మీడియాకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధాన స్రవంతి మీడియా ఎప్పుడూ బాధ్యతగానే ఉంటుందని సొలిసిటర్‌ జనరల్‌ అన్నారు. టాబ్లాయిడ్లు, డిజిటల్‌ ప్లాట్‌ఫాంలు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతుంటాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యాన్ని సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది వికా్‌ససింగ్‌, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్‌పర్సన్‌, సీనియర్‌ న్యాయవాది మనన్‌కుమార్‌ మిశ్రా స్వాగతించారు.

ప్రధాని అసంతృప్తి..

న్యాయవ్యవస్థలో అవినీతి అంశాన్ని ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకంలో అధ్యాయంగా చేర్చడంపై ప్రధాని మోదీ అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. బాధ్యులపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవలసిందేనని తేల్చిచెప్పినట్లు సమాచారం. ప్రస్తు తం ఇజ్రాయెల్‌లో ఉన్న ఆయన.. ‘ఈ వ్యవహారం ఎవరు చూస్తున్నారు’ అని ప్రశ్నించినట్లు పీఎంవో వర్గాలు తెలిపాయి. మరోవైపు.. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా దీనిపై స్పందించారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీ సుకుంటామన్నారు. ‘జరిగినదానికి బాధపడుతున్నాను. విచారణ జరిపి.. ఆ చాప్టర్‌ రాసినవారి పై చర్యలు తీసుకుంటాం. ఆ పాఠ్యపుస్తకాల పం పిణీ ఆపేశాం. ప్రజాస్వామ్య భారతంలో న్యాయవ్యవస్థ సర్వోన్నతమైనది. కోర్టు ఆదేశాలను అమలుచేస్తాం’ అని జంషెడ్‌పూర్‌లో వెల్లడించారు.


ఆ ప్రకటనలో క్షమాపణ ఊసేదీ?

తొలుత ఈ వ్యవహారంపై సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్ర పాఠశాల విద్యాశాఖ తరఫున బేషరతుగా క్షమాపణలు చెప్పారు. విచారణ ప్రారంభం కాగానే.. ఆ పాఠ్యపుస్తకంలోని అధ్యాయాన్ని ఎన్‌సీఈఆర్‌టీ ఉపసంహరించుకుందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. చేసిన తప్పునకు క్షమాపణ చెప్పిందన్నారు. అయితే ఎన్‌సీఈఆర్‌టీ విడుదల చేసిన ప్రకటనలో క్షమాపణకు సంబంధించి ఒక్క మాట కూడా లేదని చీఫ్‌ జస్టిస్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఆరా తీయాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ను తాను కోరితే.. ఎన్‌సీఈఆర్‌టీ ఆ అధ్యాయాన్ని సమర్థించుకుందని చెప్పా రు. ఈ అధ్యాయాన్ని సమర్థించినవారు భవిష్యత్‌లో ఎన్‌సీఈఆర్‌టీలో గానీ, ఏ ప్రభుత్వ శాఖలో గానీ ఉండరని మెహతా హామీ ఇచ్చారు. సీజేఐ స్పందిస్తూ.. ‘అప్పుడు వారికి మరింత తేలికవుతుంది. బాధ్యత నుంచి తప్పించుకుంటారు. వారు తుపాకీ పేల్చారు.. ఇవాళ న్యాయవ్యవస్థ నెత్తురోడుతోంది. మాపై దండయాత్ర చేస్తే.. సమతుల్యత ఎలా పాటించాలో మాకు తెలుసు. ఆ పుస్తకం ప్రతులు ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయి’ అని అని అన్నారు. మార్కెట్లోకి 32 కాపీలు మాత్రమే వెళ్లాయని.. వాటిని వెనక్కి తెప్పిస్తామని మెహతా తెలిపారు. సదరు అధ్యాయం మొత్తాన్నీ కొత్త బృందం పునఃసమీక్షిస్తుందని.. దానిని తిరిగి ప్రచురిస్తారని చెప్పారు. ఈ ఒక్క అధ్యాయమే కాదని.. అందులో ‘న్యాయం ఆలస్యమైతే.. న్యాయాన్ని నిరాకరించడ మే’ అన్న శీర్షికతో మరో సమస్యాత్మక చాప్టర్‌ ఉందని.. అందులో అన్నీ తప్పులతడక గణాంకాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే దీని ప్రచురణకు బాఽధ్యులెవరో తేల్చాల్సిన అవసరం ఉందని సీజేఐ పునరుద్ఘాటించారు. వారెవరో తెలియాలని.. వారిపై వేటు పడక తప్పదని.. విచారణను తాను మూసివేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

Updated Date - Feb 27 , 2026 | 04:16 AM