6 వారాల్లోగా 273 ఎన్‌డీపీఎస్ కోర్టులను ఏర్పాటు చేయండి
ABN , Publish Date - Sep 08 , 2026 | 05:51 AM
దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం కింద..
దేశవ్యాప్తంగా 449 స్పెషల్ కోర్టులు
అవసరముంటే ఏర్పాటైంది 176 మాత్రమే..
తెలంగాణలో ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టును
2 వారాల్లో ఏర్పాటు చేయాలి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం కింద నమోదయ్యే కేసుల విచారణ కోసం దేశవ్యాప్తంగా 449 ప్రత్యేక కోర్టులు అవసరమని గుర్తించగా.. ఇప్పటివరకు 176 మాత్రమే ఏర్పాటయ్యాయని తెలిపింది. మిగతా 273 కోర్టులను ఆరు వారాల్లోగా ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. కోర్టుల కొరతను తీర్చడానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతోపాటు న్యాయ, పరిపాలనా సిబ్బందిని వెంటనే నియమించాలని స్పష్టం చేసింది. ఎన్‌ఐఏ, ఎన్‌డీపీఎస్ చట్టాల కింద ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై సుమోటోగాతీసుకుని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనాల ధర్మాసనం విచారణ చేపట్టింది. అలాగే ఎన్‌ఐఏ చట్టం సెక్షన్ 11 కింద ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై కూడా సమీక్ష జరిపింది. ఈ నేపథ్యంలోనే దేశంలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టుల వివరాలను అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి కోర్టుకు తెలిపారు. జాతీయ స్థాయిలో కొత్తగా 8 కోర్టులు ఏర్పాటవడంతో మొత్తం సంఖ్య 22కి చేరిందని వెల్లడించారు. అయితే తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్క ప్రత్యేక కోర్టు కూడా లేదని.. ఆయా రాష్ట్రాలను తక్షణమే స్పందించేలా ఆదేశించాలని కోరారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. తెలంగాణలో 13 కేసులు పెండింగ్‌లో ఉన్న దృష్ట్యా ఒక ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు అయినా అవసరమని పేర్కొంది. ‘ఇది ప్రజల మేలు కోసమే.. కేంద్రం నిధులు ఇస్తోంది. వాటిని వినియోగించుకోండి’ అని తెలంగాణ తరఫు న్యాయవాదికి సూచించింది. రెండు వారాల్లోగా ఈ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని ఆదేశించింది.