మహిళలను నెలలో 3 రోజులు అస్పృశ్యులుగా చూడరాదు
ABN , Publish Date - Apr 08 , 2026 | 03:49 AM
ఒక మహిళను నెలకు మూడు రోజుల పాటు ‘అంటరాని వ్యక్తి’గా పరిగణించకూడదు’’ అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న స్పష్టం చేశారు. అన్ని వయసుల మహిళలనూ శబరిమల ఆలయంలోకి...
శబరిమల కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న వ్యాఖ్యలు
ఈ అంశం మతవిశ్వాసాలకు చెందినది
న్యాయసమీక్ష పరిధిలోకి రాదు
9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి తెలిపిన కేంద్రం
గంపగుత్తగా మహిళలందరిపైనా నిషేధం విధించట్లేదని స్పష్టీకరణ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ‘‘ఒక మహిళను నెలకు మూడు రోజుల పాటు ‘అంటరాని వ్యక్తి’గా పరిగణించకూడదు’’ అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న స్పష్టం చేశారు. అన్ని వయసుల మహిళలనూ శబరిమల ఆలయంలోకి అనుమతిస్తూ గతంలో ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం జరుపుతున్న రిఫరెన్స్ (విచారణ) సందర్భంగా ఆమె ఈ కీలక వ్యాఖ్య చేశారు. వయసు లేదా రుతుక్రమ స్థితి ఆధారంగా శబరిమల ఆలయంలోకి మహిళలను రానీయకపోవడం ఒకరకమైన అంటరానితనం కిందికే వస్తుందని.. ఇది వారి గౌరవానికి భంగకరమని, పితృస్వామ్య ధోరణి అని 2018నాటి తీర్పులో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ అంశం మతవిశ్వాసాలకు సంబంధించినదని.. ఇది న్యాయ సమీక్ష పరిధికి ఆవల ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మంగళవారం విచారణ సందర్భంగా పేర్కొన్నారు. ‘‘ప్రతిదాన్నీ గౌరవంతో, స్వేచ్ఛతో ముడిపెట్టలేం. నేనొక మజార్‌కో గురుద్వారాకో వెళ్లినప్పుడు నా తలను కప్పుకోవాల్సి వస్తే.. నా గౌరవానికి, ఏంచుకునే హక్కుకు భంగం కలిగిందని అనలేను’’ అని వివరించారు. ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం విధించడం అంటరానితనం కిందికి వస్తుందని.. ఇది రాజ్యాంగంలోని 17వ అధికరణను(అంటరానితనంపై నిషేధం) ఉల్లంఘించడమేనని 2018 తీర్పులో సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం కేవలం వయసుపై ఆధారపడి ఉంటుంది తప్ప.. గంపగుత్తగా మొత్తం మహిళలందరిపైనా నిషేధం విధించట్లేదని, అది కూడా అక్కడ కొలువై ఉన్న దేవుడి విశిష్ట స్వభావమే (అయ్యప్పస్వామి నైష్టిక బ్రహ్మచారి కావడమే) అందుకు కారణం తప్ప, అక్కడ ఎలాంటి లింగ వివక్షా లేదని స్పష్టం చేశారు.
పితృస్వామ్యం, లింగవివక్ష వంటి పాశ్చాత్య భావనలకు భారతదేశంలో చోటు లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న జస్టిస్ బీవీ నాగరత్న... ‘‘శబరిమల కేసు విషయంలో ఆర్టికల్ 17ను ఎలా వాదిస్తారో తెలియదుగానీ, ఒక మహిళగా చెబుతున్నాను.. ప్రతి నెలా మూడురోజులు అస్పృశ్యత ఉండి, నాలుగోరోజు లేకపోవడం అనేది ఉండదు’’ అని వ్యాఖ్యానించారు. కాగా.. రాజ్యాంగంలోని 25వ అధికరణ ఇచ్చే సమానత్వ హక్కును.. మతాల మధ్య సమానత్వం అనే కోణంలో అర్థం చేసుకోవాలే తప్ప, లింగ వివక్ష అనే అంశం అసలు ఆ ఆర్టికల్ కిందికే రాదని వాదనల సందర్భంగా తుషార్ మెహతా గుర్తుచేశారు. ఏదైనా ఒక మతపరమైన ఆచారం ఆ మతానికి ఆవశ్యకమా కాదా? అని నిర్ణయించే అధికారం కోర్టులకు లేదని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 25(2)(బి) అధికరణ ప్రకారం.. ఏ మతంలోనైనా సంస్కరణలు తీసుకురావడానికి చట్టం చేసే అధికారం కేవలం చట్టసభలకు మాత్రమే ఉంటుందన్నారు. ప్రస్తుత రాజ్యాంగ ధర్మాసనం ముందున్న ఈ రిఫరెన్స్ (విచారణ).. మతపరమైన ఆచారాల విషయంలో న్యాయవ్యవస్థ జోక్యం ఎంతవరకూ ఉండాలనే పరిధిని కూడా నిర్ణయిస్తుందని గుర్తుచేశారు.