ఓటర్ల అప్పీళ్లపై ట్రైబ్యునళ్లకు గడువు విధించలేం
ABN , Publish Date - Apr 07 , 2026 | 04:41 AM
పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (సర్)పై వచ్చిన అప్పీళ్లపై విచారణ జరిపేందుకు ట్రైబ్యునళ్లకు ఎలాంటి గడువు విధించలేమని సోమవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
పశ్చిమ బెంగాల్‌లో ‘సర్’పై సుప్రీంకోర్టు
అయోమయంలో 20 లక్షల ఓటర్ల భవిత
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (సర్)పై వచ్చిన అప్పీళ్లపై విచారణ జరిపేందుకు ట్రైబ్యునళ్లకు ఎలాంటి గడువు విధించలేమని సోమవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఓటర్లు సమర్పించిన వినతులపై విచారణ జరిపిన న్యాయాధికారుల డిజిటల్ సంతకాలను అప్‌డేట్ చేయడానికి గడువును ఒకరోజు పాటు పొడిగించి మంగళవారం వరకు అవకాశం ఇస్తున్నట్టు తెలిపింది. డిజిటల్ సంతకాలు లేకపోయినా తుది అనుబంధ ఓటర్ల జాబితాను మంగళవారమే ప్రకటించాలని పేర్కొంది. ఓటర్ల పేర్లతో తుది అనుబంధ జాబితాను సోమవారం రాత్రే ప్రచురిస్తామని ఎన్నికల సంఘం చెప్పిన నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇచ్చింది. అప్పీళ్లకు గడువు నిర్దేశించలేమని చెప్పినందున దాదాపు 20 లక్షల మంది ఓటర్ల పరిస్థితి అయోమయంలో పడింది. సర్‌ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. సీఎం మమత తరఫున సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు వినిపిస్తూ తొలగించిన ఓటర్ల జాబితాల లెక్కలను వివరించారు. ‘‘తొలుత ఓటర్ల జాబితా నుంచి 60 లక్షల మంది పేర్లను తొలగించారు. ఓటర్ల నుంచి వచ్చిన వినతుల ఆధారంగా 40 లక్షల పేర్లను జత చేశారు. 20 లక్షల మంది పేర్లను తొలగించారు. తొలగించిన వారిలో ఇప్పటికే 7 లక్షల మంది అప్పీలు చేశారు. ఇంకా చాలా మంది ఆ ప్రయత్నాల్లో ఉన్నారు’’ అని చెప్పారు. అప్పీళ్లపై విచారణ జరిపేందుకు 19 ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేసినా అవి ఇంకా పూర్తిగా పని ప్రారంభించలేదని తెలిపారు. మరో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ పేర్లను తప్పుగా తొలగించినట్టు ప్రాథమికంగా గుర్తిస్తే వాటిని జత చేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ ట్రైబ్యునళ్లను ఆదేశించాలని కోరారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. ఎలాంటి గడువు విధించలేమని తెలిపింది. ట్రైబ్యునళ్ల పనితీరుకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని కలకత్తా హైకోర్టుకు సూచించింది. ఇందుకోసం ఒక మాజీ ప్రధాన న్యాయమూర్తి, ఇద్దరు మాజీ న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేయాలని కూడా తెలిపింది. జస్టిస్ బాగ్చీ మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఓటరు జాబితాల్లో పేర్ల నమోదును ఎక్కడో ఒక చోట నిలిపివేయాల్సి ఉందని చెప్పారు.
విచారణ సందర్భంగా న్యాయాధికారుల భద్రతపైనా సుప్రీంకోర్టు దృష్టి పెట్టింది. మాల్దా జిల్లాలో న్యాయాధికారులను ఘెరావ్ చేసిన నేపథ్యంలో వారి భద్రతకు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఒకవేళ కల్పించకపోతే ఏమి చేయాలో చూస్తామని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో కేంద్ర బలగాలను కొనసాగించాలని తెలిపింది. ఘెరావ్ కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించాలని ఆదేశించింది. విచారణకు పశ్చిమ బెంగాల్ సీఎస్, డీజీపీలు ఆన్‌లైన్ ద్వారా హాజరయ్యారు. న్యాయాధికారులను నిర్బంధించిన రోజున కలకత్తా హైకోర్టు సీజే ఫోన్ చేస్తే ఎందుకు తీయలేదని సీఎ్‌సను జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. తాను ఆ సమయంలో విమానంలో ఢిల్లీ నుంచి వస్తున్నానని చెప్పారు. తన ఫోన్‌కు భద్రత అధికంగా ఉంటుందని, అందుకే సిగ్నళ్లు అందలేదని తెలిపారు. జస్టిస్ బాగ్చీ స్పందిస్తూ ‘మీ ఫోన్ భద్రతను కొంచం తగ్గిస్తే హైకోర్టు సీజే లాంటి అతిసాధారణ వ్యక్తులు మీతో మాట్లాడుగలుగుతారు’ అంటూ చురక అంటించారు.