18 ఏళ్లలోపు వారి ‘సోషల్’ ఖాతాలకు తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి?
ABN , Publish Date - Sep 29 , 2026 | 03:53 AM
సోషల్ మీడియా, డిజిటల్ వేదికల్లో 18 ఏళ్లలోపు పిల్లలు తల్లిదండ్రుల సమ్మతి లేకపోతే ఖాతాలు తెరవకుండా అడ్డుకునే అంశాన్ని (భారతీయ ఒప్పందాల చట్టం ప్రకారం) పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మైనర్లు నేరుగా కాంట్రాక్టుల్లో భాగస్వాములు
కాకుండా నిషేధం విధించాలి!
ఈ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించండి
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం
మైనర్ల భద్రతకు తప్పకుండా చర్యలు: కేంద్రం
వయసు నిర్ధారణ, తల్లిదండ్రుల సమ్మతిపై
దేశవ్యాప్తంగా ఏకరూప వ్యవస్థను తేవాలి
ఐటీ చట్టంలో సవరణలు చేసేలా కేంద్రాన్ని
ఆదేశించాలి.. పిటిషనర్ వాదన
న్యూఢిల్లీ, సెప్టెంబరు 28: సోషల్ మీడియా, డిజిటల్ వేదికల్లో 18 ఏళ్లలోపు పిల్లలు తల్లిదండ్రుల సమ్మతి లేకపోతే ఖాతాలు తెరవకుండా అడ్డుకునే అంశాన్ని (భారతీయ ఒప్పందాల చట్టం ప్రకారం) పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మైనర్లు నేరుగా సోషల్ మీడియా ఖాతాల కాంట్రాక్టుల్లో భాగస్వాములు కాకుండా చట్టపరంగా నిషేధం విధించే అంశాన్నీ పరిశీలించాలని సూచించింది. ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా న్యాయవాది హెచ్.ఎ్‌స.ఫూల్కా చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహనల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ అంశాలపై స్పందన తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఎదుట సోమవారం ఈ పిటిషన్‌పై మరోసారి విచారణ జరిగింది. భారత్‌లో పిల్లల ‘ఆన్‌లైన్ భద్రత’కు కొన్ని రక్షణలు ఉండాల్సిన అవసరం తప్పనిసరి అని పేర్కొంది. ‘కచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. తప్పకుండా చేస్తాం. మైనర్ల భద్రతకు సంబంధించి చర్యలు తీసుకుంటాం’ అని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. ‘‘ఆయా సోషల్ మీడియా సంస్థలు భారతీయ చట్టాలకు లోబడి పనిచేసేలా ఆదేశాలు జారీ చేయండి. ఆ సంస్థల సాఫ్ట్‌వేర్ కచ్చితంగా భారత చట్టాలకు అనుగుణంగానే ఉండాలి. ఇది మా అభ్యర్థన’’ అని జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి అన్నారు. స్పందించిన తుషార్ మెహతా.. అది అభ్యర్థన కాదని, ఆదేశమని చెప్పారు. ఈ అంశాన్ని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. దేశంలో అమల్లో ఉన్న చట్టాల్లో పిల్లల డిజిటల్ భద్రతపై స్పష్టత లేకపోవడం వల్ల వారిపై సైబర్ ముప్పులు పెరుగుతున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. ‘భారతీయ ఒప్పందాల చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు వ్యక్తి చట్టబద్ధమైన ఒప్పందం కుదుర్చుకోలేడు. అయితే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్, స్నాప్‌చాట్, ఎక్స్ వంటి అనేక డిజిటల్ వేదికలు కేవలం పుట్టిన తేదీ నమోదు ఆధారంగా మైనర్లకు ఖాతాలు తెరవడానికి అనుమతి ఇస్తున్నాయి. దీంతో వారు తెలియకుండానే చట్టపరమైన నిబంధనలకు అంగీకరిస్తున్నట్లు అవుతోంది’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. తల్లిదండ్రుల సమ్మతి లేకుండా మైనర్లు సోషల్ మీడియాను వినియోగించడం వల్ల ఆన్‌లైన్‌లో మోసపూరితంగా నమ్మించడం(గ్రూమింగ్), సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, వ్యక్తిగత సమాచార దుర్వినియోగం వంటి తీవ్రమైన ప్రమాదాలు ఎదురవుతున్నాయని తెలిపారు.
పిల్లల వయసు నిర్ధారణ, తల్లిదండ్రుల గుర్తింపు, సమ్మతి ధ్రువీకరణ కోసం దేశవ్యాప్తంగా ఏకరూప వ్యవస్థను రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. డిజిటల్ వ్యక్తిగత సమాచార రక్షణ చట్టం-2023 ప్రకారం పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించాలంటే తల్లిదండ్రుల సమ్మతి అవసరమని.. కానీ, సోషల్ మీడియా ఖాతా సృష్టించడాన్ని నిషేధించే స్పష్టమైన నిబంధన ఏదీ లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది గుర్తుచేశారు. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సమ్మతి లేకుండా 18 ఏళ్లలోపు పిల్లలు డిజిటల్ ప్లాట్‌ఫాంల్లో కాంట్రాక్ట్ చేసుకునే అవకాశం లేకుండా చూడాలని.. ఆ మేరకు ఐటీ చట్టం-2021లో సవరణలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని ధర్మాసనాన్ని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
రోడ్డు తనిఖీలో చెంపదెబ్బ వివాదం! ఢిల్లీ మంత్రి పర్వేష్ వర్మపై కేసు నమోదు
ఎల్‌పీయూలో భయానక రాత్రి.. ఆ రోజు ఏం జరిగింది..?