ఆచారాలపై తీర్పులివ్వలేం
ABN , Publish Date - Apr 23 , 2026 | 05:54 AM
ఒక మతానికి సంబంధించిన ఆచారం అవసరమా? కాదా? అని నిర్ణయించే ప్రమాణాలను ప్రకటించటం అసాధ్యమేమీ కాకపోయినా చాలా కష్టమైన విషయమని సుప్రీంకోర్టు...
నైతికతకు, ప్రజలకు నష్టం కలిగించనంతవరకూ కాదనలేం
ప్రభుత్వ జోక్యంపై సార్వత్రిక ప్రమాణాలు నిర్ణయించలేం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ఒక మతానికి సంబంధించిన ఆచారం అవసరమా? కాదా? అని నిర్ణయించే ప్రమాణాలను ప్రకటించటం అసాధ్యమేమీ కాకపోయినా చాలా కష్టమైన విషయమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నైతికతకు, శాంతిభద్రతలకు, ప్రజల ఆరోగ్యానికి నష్టం చేయనంతకాలం.. ఒక మతంలోని ఓ ప్రత్యేకమైన వర్గం అనుసరించే ఆచారాన్ని కాదనలేమని స్పష్టం చేసింది. సదరు వర్గానికి తమవైన సంప్రదాయాలను అనుసరించే హక్కు రాజ్యాంగం ప్రకారం ఉంటుందని తెలిపింది. శబరిమలతోపాటు దేశంలోని పలు ఆలయాల్లో మహిళల ప్రవేశంపై ఆంక్షలు, మతవిశ్వాసం, ప్రాథమిక హక్కులు తదితర అంశాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని 9 మంది సభ్యుల ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. బుధవారం సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేదితోపాటు పలువురు వాదనలు వినిపించారు. ఒక ప్రత్యేక సమూహం తమ దేవుడిని ఎలా కొలుచుకోవాలన్నది ఆ సమూహానికే వదిలేయాలని, వారి విశ్వాసాల్లో జోక్యం చేసుకోవటం వల్ల సమస్య లు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. భక్తులు తమకు నచ్చిన దేవుడితో భావోద్వేగాలతో అనుసంధానమై ఉంటారని, ఆ భావోద్వేగాలను దెబ్బతీస్తే భక్తులు తీవ్రంగా స్పందిస్తారని తెలిపారు. మతం పేరుతో ఏదైనా అవినీతి, అన్యాయం వంటిది జరిగినప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చుగానీ.. అటువంటిదేమీ లేనప్పుడు జోక్యం అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ నాగరత్న స్పందిస్తూ.. ‘మేం వేరు.. మీరు వేరు. మీ ఆలయాలకు మేము రాబోము. మా ఆలయాలకు మీరు రావద్దు అంటూ విభజన రేఖలు గీయటం వల్ల హిందూ సమాజానికి నష్టం వాటిల్లుతుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ వివక్షలను తొలగించటానికే రాజ్యాంగంలో ఆర్టికల్ (2)(బీ)ని చేర్చి.. ధార్మిక సంస్థలు, ఆలయాల్లోకి అందరికీ ప్రవేశం కల్పించే సంస్కరణలు అమలు చేశారని గుర్తు చేశారు. అయితే, సంస్కరణల పేరిట మతాచారాల్లో ప్రభుత్వం జోక్యంపై సార్వత్రిక ప్రమాణాలను నిర్ణయించలేమని, అవి కేసును బట్టి మారుతుంటాయని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు.