ప్రైవేటు స్కూల్ టీచర్ల సంక్షేమానికి జాతీయ విధానం కావాలి
ABN , Publish Date - Sep 11 , 2026 | 05:59 AM
దేశంలోని లక్షలాది మంది ప్రైవేటు స్కూల్ టీచర్ల సంక్షేమం, సామాజిక భద్రత, రిటైర్మెంట్ అనంతర జీవన భద్రత కోసం ఓ సమగ్ర జాతీయ విధానాన్ని రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని..
సుప్రీంకోర్టులో పిటిషన్.. కేంద్రానికి, రాష్ట్రాలకు నోటీసులు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 10: దేశంలోని లక్షలాది మంది ప్రైవేటు స్కూల్ టీచర్ల సంక్షేమం, సామాజిక భద్రత, రిటైర్మెంట్ అనంతర జీవన భద్రత కోసం ఓ సమగ్ర జాతీయ విధానాన్ని రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరించింది. దీనిపై స్పందన తెలియజేయాలని పేర్కొంటూ కేంద్రప్రభుత్వంతోపాటు రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలకు, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలికి గురువారం నోటీసులు జారీ చేసింది. కేరళకు చెందిన లిజిమోల్ జార్జ్ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన 2023-24 గణాంకాల ప్రకారం.. దేశంలో 14.71 లక్షల స్కూళ్లు, 98 లక్షలమందికిపైగా ఉపాధ్యాయులు, 24.8 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారని పిటిషనర్ వెల్లడించారు. మొత్తం టీచర్లలో గుర్తింపు పొందిన ప్రైవేటు అన్‌ఎయిడెడ్ స్కూళ్లలోనే 37,30,047 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో కీలకమైన విద్యారంగంలో వీరు ఇతోధిక కృషి చేస్తున్నప్పటికీ.. వీరి సంక్షేమాన్ని పట్టించుకునే ఒక ప్రత్యేకమైన విధానంగానీ, బోర్డుగానీ లేదని తెలిపారు. ఫలితంగా ప్రైవేటు టీచర్లు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని, వేతనాల్లో తీవ్రమైన వ్యత్యాసం ఉంటోందని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది.