Share News

34 లక్షల మందికి గుండుగుత్తగా ఓటు హక్కు ఇవ్వలేం

ABN , Publish Date - Apr 14 , 2026 | 04:05 AM

మరో పది రోజుల్లో పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో లక్షలాది ఓటర్ల తొలగింపుపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు బాధితులకు తక్షణ ఓటుహక్కును కల్పించేందుకు నిరాకరించింది.

34 లక్షల మందికి గుండుగుత్తగా ఓటు హక్కు ఇవ్వలేం

  • తొలగించిన ఓట్ల కన్నా గెలుపు మార్జిన్‌ తక్కువగా ఉంటే మళ్లీ కోర్టుకు రండి!

  • బెంగాల్లో తొలగించిన ఓట్లపై సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): మరో పది రోజుల్లో పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో లక్షలాది ఓటర్ల తొలగింపుపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు బాధితులకు తక్షణ ఓటుహక్కును కల్పించేందుకు నిరాకరించింది. సర్‌ కారణంగా రద్దయిన తమ ఓటు హక్కును పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు నియమిత ట్రైబ్యునల్‌ ముందు దరఖాస్తు చేసుకున్న 34 లక్షల మందికి ఏప్రిల్‌ 23, 29 తేదీల్లో జరిగే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని ఇవ్వాలన్న విజ్ఞప్తిని తిరస్కరించింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. విచారణను రెండు వారాలు వాయిదా వేసింది. దాంతో ఏప్రిల్‌ 9న ఎన్నికల సంఘం ప్రచురించిన ఓటర్ల జాబితా ఆధారంగానే బెంగాల్‌ శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. రెండు దశల పోలింగ్‌ తేదీల నాటికి ట్రైబ్యునల్‌ మరో ఒకటి రెండు లక్షల మంది పిటిషన్లను పరిష్కరించి అర్హులను ఓటర్ల జాబితాలో చేర్చే అవకాశం ఉంది. వారికోసం అనుబంధ జాబితాలను విడుదల చేస్తారు. అయితే, జరుగుతున్న ఎన్నికల ఫలితాలను సవాలు చేసేందుకు అవసరమైన ఒక కీలక న్యాయసూత్రాన్ని(లీగల్‌ ప్రిన్సిపుల్‌) కోర్టు సోమవారం ఆవిష్కరించింది. తొలగించబడిన ఓట్ల సంఖ్య కన్నా గెలుపు మార్జిన్‌ తక్కువగా ఉంటే బాధితులు కోర్టు తలుపు తట్టొచ్చని చెప్పింది. సోమవారం విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ మాల్యా బాగ్జీ ఎన్నికల ఫలితాలపై కోర్టులు ఎప్పుడు జోక్యం చేసుకోవచ్చో వివరించారు. ఒక నియోజకవర్గంలో అభ్యర్థి గెలుపు మార్జిన్‌ కన్నా అక్కడ తొలగించిన ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంటే ఆ ఎన్నికల ఫలితాలపై కోర్టు జోక్యం కుదరదని చెప్పారు. అభ్యర్థి మెజారిటీ 5ు కన్నా తక్కువగా ఉండే ప్రతీచోటా తొలగించిన ఓటర్ల సమస్యను గట్టిగా పట్టించుకోవాల్సి ఉంటుందన్నారు. అలాంటి చోట మెజారిటీ కన్నా తొలగింపునకు గురై ఓటు పునరుద్ధరణకు అప్పీలు చేసుకున్న ఓటర్ల సంఖ్య అధికంగా ఉంటే కోర్టు తీవ్రంగా పరిగణిస్తుందని, ఎవరైనా పిటిషన్లు వేస్తే పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. ప్రస్తుతం 34 లక్షలకు పైగా అప్పీళ్లు పెండింగులో ఉన్నాయని, ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వాటన్నింటినీ పరిష్కరించమని ట్రైబ్యునళ్లను ఒత్తిడి చేయలేమని సుప్రీంకోర్టు పిటిషనర్లకు స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఓటర్లు రెండు రాజ్యాంగ శక్తుల మధ్య నలిగిపోతున్నారని జస్టిస్‌ బాగ్చీ వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మధ్య జరుగుతున్న వివాదంలో సామాన్య ఓటరు హక్కులు ప్రశ్నార్థకం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు హక్కు అనేది కేవలం ఒక రాజ్యాంగ హక్కు మాత్రమే కాదని, అది ఒక దేశ పౌరుడికి ఉండే సెంటిమెంట్‌ అని అభివర్ణించారు. సుప్రీంకోర్టు ప్రస్తుతానికి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా తొలగించబడ్డ ఓటర్ల అప్పీళ్ల విచారణ బాధ్యతను ట్రైబ్యునల్‌ కే వదిలేసింది. అయితే, 19 ట్రైబ్యునళ్లు 34 లక్షల పిటిషన్లను ఎన్నికలు అయ్యే లోపు పరిష్కరించడం మానవ సాధ్యం అయ్యే వ్యవహారం కాదని కోర్టు అభిప్రాయపడింది.

Updated Date - Apr 14 , 2026 | 04:05 AM