Share News

పోలింగ్‌ కేంద్రాల్లో బయోమెట్రిక్‌

ABN , Publish Date - Apr 14 , 2026 | 04:06 AM

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు బయోమెట్రిక్‌ను ప్రవేశపెట్టాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ...

పోలింగ్‌ కేంద్రాల్లో బయోమెట్రిక్‌

  • సుప్రీంలో అశ్వినీకుమార్‌ పిటిషన్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు బయోమెట్రిక్‌ను ప్రవేశపెట్టాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఓటు హక్కు దుర్వినియోగం కాకుండా బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయాలన్న పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలింగ్‌ కేంద్రాల్లో వేలిముద్రలు, ఐరిస్‌ ఆధారిత బయోమెట్రిక్‌ గుర్తింపును అమలు చేయాలంటూ బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీంను ఆశ్రయించారు. సోమవారం ఈ పిటిషన్‌ను సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ‘‘కొన్ని రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న ఎన్నికల కోసం ఈ విధానాన్ని పరిశీలించలేం. అయితే, భవిష్యత్తులో జరగబోయే సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి పద్ధతిని అనుసరించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సి ఉంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బయోమెట్రిక్‌ వ్యవస్థ ఎన్నికల మోసాలను నివారించేందుకు శక్తిమంతమైన ఆయుధం అని పిటిషనర్‌ ఉపాధ్యాయ్‌ తెలిపారు.

Updated Date - Apr 14 , 2026 | 04:06 AM