Share News

‘మహిళల కో-ఆప్టింగ్‌’పై నిర్ణయించండి!

ABN , Publish Date - Apr 14 , 2026 | 04:08 AM

రాష్ట్రాల బార్‌ కౌన్సిళ్ల ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు వారిని ఏ విధంగా కో-ఆప్ట్‌ చేయాలన్న అంశంపై తగు నిర్ణయం తీసుకోవాలని జస్టిస్‌ సుధాంశు ధూలియా ...

‘మహిళల కో-ఆప్టింగ్‌’పై నిర్ణయించండి!

  • బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో ప్రాతినిధ్యంపై జస్టిస్‌ ధూలియా కమిటీకి సుప్రీం సూచన

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 13: రాష్ట్రాల బార్‌ కౌన్సిళ్ల ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు వారిని ఏ విధంగా కో-ఆప్ట్‌ చేయాలన్న అంశంపై తగు నిర్ణయం తీసుకోవాలని జస్టిస్‌ సుధాంశు ధూలియా నేతృత్వంలోని కమిటీకి సుప్రీంకోర్టు సూచించింది. బార్‌ కౌన్సిళ్లలో కో-ఆప్షన్‌ ఎంపిక అనేది వివాదాలకు తావు లేకుండా ఉండాలని పేర్కొంది. ఈ మేరకు సోమవారం సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, న్యాయమూర్తి జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. కో-ఆప్షన్‌కు సంబంధించి స్పష్టతలేదని.. దీంతో ఇది దుర్వినియోగం అయ్యే ప్రమాదముందని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. సీనియర్‌ న్యాయవాది డీఎస్‌ నాయుడు వాదనలు వినిపిస్తూ.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మహిళలు ఓపెన్‌ కేటగిరీలోనే పోటీ చేసి పురుషులపై విజయం సాధించారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి మహిళలు లేనప్పుడు మాత్రమే కో-ఆప్షన్‌ విధానాన్ని చేపట్టాలని సూచించారు. అదేవిధంగా కో-ఆప్షన్‌ కింద మహిళలను సిఫారసు చేసే అవకాశం బార్‌ కౌన్సిళ్లకు ఇవ్వడం సరికాదని, ఇది గందరగోళానికి దారి తీస్తుందని తెలిపారు. పోటీ చేసి ఓడిపోయిన మహిళా సభ్యులను కో-ఆప్షన్‌ విధానంలో ఎంపిక చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. కాగా, బార్‌ కౌన్సిళ్లలో మహిళల ప్రాతినిధ్యాన్ని 30 శాతానికి పెంచాలని 2023, డిసెంబరులో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒకవేళ తగినంత సంఖ్యలో మహిళలు ఎన్నికకాని పక్షంలో కో-ఆప్షన్‌ కింద 10 శాతం మేరకు వారిని భర్తీ చేయాలని స్పష్టం చేసింది.

Updated Date - Apr 14 , 2026 | 04:08 AM